Begin typing your search above and press return to search.

మరీ అంత మెత్తగా ఉండకు బాబూ.... బొకేలే బాకులవుతాయి

By:  Tupaki Desk   |   7 Aug 2022 9:50 AM GMT
మరీ అంత మెత్తగా ఉండకు బాబూ.... బొకేలే బాకులవుతాయి
X
చంద్రబాబులో ఉన్నది మొహమాటం. ఒక విధంగా ఆయన మెత్తగా ఉంటారని పేరు. ఆయన ఎంతసేపూ అవతల వారిని ఉదార స్వభావంతో చూస్తూ ఉంటారు. వారు ఎంత పెద్దగా గొంతు చించుకున్నా బాబు మాత్రం సహనాన్నే చూపుతారు. బాబు ఫిలాసఫీ ఏంటి అంటే మాటలు ఎందుకు చేతలు ఉండాలని. అలాగని ఎవరైనా తన మీద అలిగినా ఆగ్రహించినా కూడా వారికి ఎన్నో చాన్సులు ఇస్తారు. వారే సర్దుకుంటారు కదా అని కూడా అనుకుంటారు.

అలాగే చంద్రబాబులో ఉండే మరో గుణం ఏంటి అంటే తనను ఎన్ని మాటలు వ్యక్తిగతంగా అన్నా కూడా ఆయన వాటిని మరచిపోయి తన దగ్గరకు వచ్చేవారిని అక్కున చేర్చుకుంటారు. రాజకీయాల్లో శాశ్వతమైన శత్రుత్వం ఉండదని బాబు భావిస్తారు. అయితే ఇదంతా గతం. ఇపుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియా కాలం నడుస్తోంది. అందరికీ అన్నీ తెలుసు. ఎవరూ ఇక్కడ అమాయకులు కారు. ఎవరు ఏ రకమైన యాక్షన్ చేసినా కూడా దాని వెనక కధ వేరేగా ఉంటుంది.

ఇదంతా ఎందుకు అంటే టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు ఎదుట ఢిల్లీ ఎయిర్ పోర్టులో దురుసు ప్రవర్తన చేశారంటూ సోషల్ మీడియాలో ఒక్క లెక్కన ట్రోల్ అవుతున్న మ్యాటర్ తోనే. బాబుకు కేశినేని నాని చేతుల మీదుగ బొకే ఇప్పించాలని మరో ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన చంద్రబాబు ముందే తిరగగొట్టి బాబును అవమానించారు. ఒక విధంగా బొకేను ఆయన అవతలకు నెట్టారు.

ఇది నిజంగా బాబుకు అవాక్కు అనిపించే చర్య. ఇది కెమెరాలకు కూడా ఎక్కడంతో లోకమంతా చూసింది. దీని మీద టీడీపీలో హార్ట్ కోర్ ఫ్యాన్స్ తమ్మ్ముళ్ళు అంతా కూడా కేశినేని నాని మీద మండిపడుతున్నారు. అదే టైమ్ లో చంద్రబాబు మెతకతనం మీద కూడా వారు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు ఏమైనా చిన్న నాయకుడా. ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. పైగా బాబు జాతీయ స్థాయి నాయకుడు. ఈ రోజుకీ ఆయకు దేశంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మరోమారు ఏపీ సీఎం అయ్యే చాన్స్ ఆయనకే ఉంది.

అలాంటి నేతను పట్టుకుని ఎన్ని కోపాలు ఉన్నా బహిరంగంగానే నాని అవమానించడాన్ని తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నాని ఎక్కువేంటి అని కూడా సోషల్ మీడియా వేదికగా వారు డిస్కషన్ పెడుతున్నారు. పార్టీ అధినాయకుడిని కించపరచిన తరువాత ఎంతటి వారి మీద అయినా చర్యలు ఉండాల్సిందే అంటున్నారు. నాని వైఖరి చాలా కాలంగా ఇబ్బందికరంగా ఉందని టీడీపీలోనే చర్చ ఉంది. ఇక కేశినేని నాని ఢిల్లీలో ఆ మధ్య ఆఫ్ ది రికార్డు గా టీడీపీ మీద చంద్రబాబు మీద హాట్ కామెంట్స్ చేసారు అని వచ్చిన వార్తలు సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హైలెట్ అయ్యాయి.

అయినా ఆయన తాను ఆ మాటలు అనలేదు అని ఖండించలేదు. అదే టైమ్ లో ఆయన చాలాసార్లు విమర్శలు కూడా ఇండైరెక్ట్ గా చేసినా టీడీపీ అధినయాకత్వం మిన్నకుండిపోయింది. దీంతోనే ఆయన మరింతగా దూకుడు చేసి చివరికి అధినేతనే అవమానించారు అని అంటున్నారు. ఇదే రకమైన చర్యను ఏ జగన్ వద్దనో ఏ కేసీయార్ వద్దనో, లేక నరేంద్ర మోడీ వద్దలో వాళ్ళ పార్టీలకు చెందిన ఎంపీలు చేస్తే చూస్తూ ఊరుకుంటారా అన్నదే తమ్ముళ్ళ నుంచి వస్తున్న ప్రశ్న.

ఈ ముగ్గురు నాయకులూ తమ ఎంపీలను అలా కంట్రోల్ లో ఉంచారని, వారి వెనకాలే ఎవరైనా కామెంట్స్ చేయవచ్చు కానీ ముందున ఈ రకమైన దురుసు ప్రవర్తన కలలో కూడా చేయడానికి సాహసించలేరని, ఒకవేళ చేస్తే మాత్రం వారిని కఠినమైన చర్యలు ఉంటాయని కూడా అంటున్నారు. అదే చంద్రబాబుకు ఈ అవమానం జరిగితే ఆయన ఎందుకు మిన్నకుండిపోయరని కూడా సొంత పార్టీ వారే ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా బాబు తన మెత్తదనాన్ని వీడి ఎక్కడికక్కడ గట్టిగా ఇచ్చుకుంటూ పోకపోతే పార్టీలో ఒక్క కేశినేని నాని కాదు చాలా మంది నానీలు పుడతారు అని కూడా అంటున్నారు. మరి బాబు సాఫ్ట్ కార్నర్ వీడుతారా అరవీర భయంకరమైన అవతారం ఎత్తుతారా. చూడాలి మరి.