Begin typing your search above and press return to search.

వ్యూహాత్మ‌కంగానే చంద్ర‌బాబును వైఎస్సార్సీపీ టార్గెట్ చేసిందా?

By:  Tupaki Desk   |   28 Aug 2022 11:15 AM GMT
వ్యూహాత్మ‌కంగానే చంద్ర‌బాబును వైఎస్సార్సీపీ టార్గెట్ చేసిందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో గ‌త మూడు రోజులుగా ప‌రిణామాలు వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. వైఎస్సార్సీపీ, టీడీపీ కార్య‌క‌ర్త‌ల దాడులు, ప్ర‌తిదాడులు, ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు చించుకోవ‌డం, అన్న క్యాంటీన్‌పై వైఎస్సార్సీపీ శ్రేణుల దాడి, చంద్ర‌బాబు రోడ్డు మీద బైఠాయించ‌డం, టీడీపీ నేత‌ల‌ను ఏక‌ప‌క్షంగా పోలీసులు అరెస్టు చేయ‌డం వంటి చ‌ర్య‌లు రాష్ట్ర స్థాయిలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

అయితే వైఎస్సార్సీపీ ఉద్దేశ‌పూర్వ‌కంగానే చంద్రబాబును సొంత నియోజ‌క‌వ‌ర్గంలో అడ్డుకుంటోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. చంద్ర‌బాబు కుప్పంలో 1989 నుంచి గెలుస్తూ వ‌స్తున్నారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వ‌రుస‌గా ఏడుసార్లు గెలుపొందారు. ఈ నేప‌థ్యంలో కుప్పంలోనే చంద్ర‌బాబును అడ్డుకుంటే ఆయ‌న ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తింటుంద‌నేది వైఎస్సార్సీపీ వ్యూహ‌మ‌ని అంటున్నారు. అలాగే రాష్ట్ర‌వ్యాప్తంగానూ టీడీపీ నేత‌ల ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తీసిన‌ట్టు అవుతుంద‌ని వైఎస్సార్సీపీ భావిస్తోంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వైఎస్సార్సీపీ అడుగ‌డుగ‌నా అడ్డంకుక‌లు సృష్టించింద‌ని పేర్కొంటున్నారు.

అంతేకాకుండా కుప్పంలోనే చంద్రబాబును ఓడిస్తామ‌ని ప‌దేప‌దే చెబుతుండ‌టం, కుప్పంలో చంద్ర‌బాబు గెల‌వ‌ర‌నే భ‌యాన్ని జొప్పించ‌డం ఇందులో భాగ‌మేన‌ని అంటున్నారు. అదేవిధంగా చంద్ర‌బాబు రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌నీయ‌కుండా కుప్పంలోనే ఆయ‌న‌కు క‌ష్టం అనే భావ‌న క‌లిగిస్తే దానిపైన దృష్టి సారించ‌డానికే చంద్ర‌బాబుకు స‌మ‌యం స‌రిపోతుంద‌ని.. దీంతో రాష్ట్ర‌మంతా చురుగ్గా ప‌ర్య‌టించ‌లేర‌ని వైఎస్సార్సీపీ యోచ‌న అని తెలుస్తోంది.

ఇలా కుప్పంపై గురిపెట్టి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే వ్యూహం అధికార పార్టీ అమ‌లు చేస్తోంద‌ని చెబుతున్నారు. దీన్ని గుర్తించ‌డం వ‌ల్లే టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు కూడా సై అంటే సై అని వైఎస్సార్సీపీకి స‌వాళ్లు విసిరార‌ని అంటున్నారు. ఏకంగా డీజీపీనే టార్గెట్ చేస్తూ చంద్ర‌బాబు మాట్లాడ‌టం, జ‌గ‌న్‌ను, మంత్రి పెద్దిరెడ్డిని వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిస్తాన‌ని ప్ర‌తి స‌వాల్ చేయ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు. చంద్రబాబు గతంలో ఎన్నడూ ఇంత‌ ఘాటుగా మాట్లాడ‌లేద‌ని గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు 33 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నామినేషన్‌ నుంచి ఎన్నికల ప్రచారం వరకూ ఆయన ఎప్పుడూ కుప్పం రాకుండానే అత్యధిక మెజార్టీతో గెలుస్తూ వచ్చా రు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న మెజారిటీ బాగా త‌గ్గింది. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుప్పం మీద దృష్టి సారించింద‌ని అంటున్నారు. చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా... టీడీపీ శ్రేణులపై గురిపెట్టి, నిత్యం అలజడులు సృష్టిస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు.