Begin typing your search above and press return to search.

ఇందుమూలంగా.. చంద్ర‌బాబు గ్ర‌హించాల్సింది ఏంటంటే..!

By:  Tupaki Desk   |   18 Dec 2022 3:30 AM GMT
ఇందుమూలంగా.. చంద్ర‌బాబు గ్ర‌హించాల్సింది ఏంటంటే..!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న విష‌యాల‌పై పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేద‌నే టాక్ పార్టీలో వినిపిస్తోంది. కేవ‌లం త‌న‌ను , త‌న పార్టీని వైసీపీనే భ‌గ్నం చేస్తోంద‌ని, త‌న పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటోంద‌ని ఆయ‌న ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. స‌రే.. ఇది కూడా జ‌రుగుతుందేమో.. ఆ విష‌యం క‌న్నా.. ముఖ్యంగా అసలు పార్టీలో క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న‌ది ఏంటి? అనేది ఆయ‌న ఆలోచ‌న చేయాల‌ని అంటున్నారు టీడీపీ సానుభూతి ప‌రులు.

ఓవ‌ర్ హెడ్ ట్యాంక్ బాగానే ఉంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించిన‌, నియ‌మించిన నాయ కులు మాత్రం ప‌నిచేయ‌డం లేద‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. నిజానికి ఏడాది కింద‌టే క్షేత్ర‌స్థాయిలో చంద్రబాబు కార్య‌వ‌ర్గాన్ని బ‌లోపేతం చేశారు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జ్‌ల‌ను నియ‌మించా రు. అదేవిధంగా మండ‌ల‌స్థాయిలో నాయ‌కుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మ‌రి వారు ప‌ని చేస్తున్నారా? లేదా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌.

ఇలా చూస్తే.. చాలా మంది ప‌నిచేయ‌డం లేదు. ఎవ‌రికి వారు ఎన్నిక‌లు ఉన్న‌ప్పుడు చూసుకుందాం లే.. అని నిమిత్త మాత్రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎవ‌రూ కూడా బాధ్య‌త‌గా ఏ విష‌యాన్ని ప‌రిశీలించ‌డం లేదు. క‌నీసం ప‌ట్టించుకోవ‌డం కూడా లేదు. అదేస‌మ‌యంలో కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అస‌లు ఇంచార్జ్ లు లేకుండా పోయారు. ఇంచార్జులు ఉన్న చోట కూడా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీరే పోటీ చేస్తారు! అని చంద్ర బాబు తేల్చి చెప్ప‌డం లేదు.

మ‌రోవైపు పొత్తుల‌పైనా క్లారిటీ లేదు. దీంతో నాయ‌కుల మ‌న‌సులో.. ప‌నిచేయాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. ఏమో రేపు ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని పొత్తులో భాగంగా వేరే వారికి కేటాయిస్తే.. ఇంతకాలం తాము చేసిన ప‌ని బూడిద లో పోసిన ప‌న్నీరు అవుతుంది.. క‌దా! అని వారు ఆలోచ‌న చేస్తున్నారు. దీనిని కూడా తోసిపుచ్చ‌డానికి ఏమీ లేదు. ఫ‌లితంగా క్షేత్ర‌స్థాయిలో పార్టీకి ఊపు లేకుండా పోతోంది. మ‌రి ఇప్ప‌టికైనా.. ఇలాంటివి స‌రిదిద్దుకుని.. నేత‌ల్లో ధైర్యం నింపే కార్య‌క్ర‌మాల‌కు చంద్ర‌బాబు తెర‌దీయ‌క‌పోతే.. పార్టీ ఇంక ఎన్నాళ్ల‌యినా.. ఇంతే అంటున్నారు ప‌రిశీల‌కులు.