Begin typing your search above and press return to search.

నారా నై.. నై.. నంద‌మూరి జై.. జై.. నా?

By:  Tupaki Desk   |   15 Nov 2021 12:47 PM GMT
నారా నై.. నై.. నంద‌మూరి జై.. జై.. నా?
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ రాజ‌కీయాలు చూస్తే.. ఇదే మాట వినిపిస్తోంది. భావి నాయ‌కుడిగా.. పార్టీ సారథిగా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్‌ను ప్ర‌మోట్ చేయాల‌నేది... చంద్ర‌బాబు ఉద్దేశం. అయితే.. ఆయ‌న‌ను ఎంత‌గా ప్రోత్స‌హించినా.. ఎన్ని ప్ర‌సంగాలు చేయించినా.. ఎన్ని బాద్య‌త‌లు అప్ప‌గించినా.. క్షేత్ర‌స్థాయిలో లోకేష్‌.. కార్య‌క‌ర్త‌ల‌ను కానీ.. నాయ‌కుల‌ను కానీ మెప్పించ‌లేక పోతున్నారు. ఇక‌, ప్ర‌జ‌ల సంగ‌తి స‌రేస‌రి!! దీంతో నారా లోకేష్ నాయ‌క‌త్వంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిజానికి 2014 ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి నారా లోకేష్ పార్టీ కోసం ప‌ని చేస్తున్నారు. అప్ప‌ట్లో ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను తెర‌చాటు నుంచి న‌డిపించార‌నే మాట ఉంది.

ఎల‌క్ట్రానిక్ మీడియా ప్ర‌చారం నుంచి పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు వ‌ర‌కు అన్నీ తానై ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. అంతేకాదు.. ఎన్నారై.. వ‌ర్గాల‌ను ఆక‌ర్షించి.. పార్టీ త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారాన్ని ముందుకు సాగించారు. ఈ క్ర‌మంలో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చంద్ర‌బాబు ఆయ‌న‌ను 2017లో ఏకంగా మండ‌లికి పంపించి.. మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక‌, అప్ప‌టి నుంచి పార్టీలో నెంబ‌ర్ 2గా లోకేష్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. పార్టీలో ఆక‌ర్షించే ల‌క్ష‌ణం.. కార్య‌కర్త‌ల‌ను ఆక‌ట్టుకునే ల‌క్ష‌ణం.. ప్ర‌జ‌ల‌ను మెప్పించే మాట‌తీరు.. అప్ప‌టిక‌ప్పుడు స్పందించే ల‌క్ష‌ణం వంటి విష‌యాల్లో నారా లోకేష్‌.. వెనుక‌బ‌డి పోతూనే ఉన్నారు. ఆయ‌న‌ను పార్టీలో `పెద్ద‌ను` చేయాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం.

కానీ, బాబు అంచ‌నాల మేర‌కు మాత్రం లోకేష్ పుంజుకోలేక పోతున్నారు. ఇక, 2019 ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి.. ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న ప‌రిస్థితి మ‌రింత‌గా స‌న్న‌గిల్లింది. వైసీపీ నేత‌ల ప్ర‌చారానికి ఆయ‌న అడ్డుక‌ట్ట వేసేలా.. త‌న మాట తీరును మార్చుకోలేక పోయారు. ప్ర‌సంగాల‌ను దంచి కొట్ట‌డంలోనూ.. అప్ప‌టిక‌ప్పుడు..ఏదైనా విష‌యం వ‌స్తే.. స్పందించ‌డం లోనూ లోకేష్ వెనుక‌బ‌డ్డారు. ఇలా మొత్తంగా లోకేష్ ప‌నితీరు.. మెప్పించ‌లేక పోయింద‌నేది వాస్త‌వం. ఇదిలావుంటే. క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న ఆహార్యంలో కొంత‌మార్పు వ‌చ్చినా.. వ్య‌వ‌హారంలో మాత్రం మార్పు రాలేదు. ఇప్ప‌టికీ.. ఆయ‌న ప్ర‌జాక‌ర్ష‌క నాయ‌కుడిగా పేరు తెచ్చుకోలేక పోతున్నారు.

దీంతో ఇటు పార్టీ సీనియ‌ర్ల‌లోను,, అటు జూనియ‌ర్ల‌లోనూ.. కూడా లోకేష్‌కు మార్కులు ప‌డ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఇదిలావుం టే.. మ‌రోవైపు.. నంద‌మూరి తార‌క రామారావు.. జూనియ‌ర్ ఎన్టీఆర్ వైపు.. పార్టీ శ్రేణులు.. మొగ్గు చూప‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి 2009 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఖాకీ దుస్తుల్లో టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన త‌ర్వాత‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎక్క‌డా మ‌ళ్లీ పార్టీ త‌ర‌ఫున గ‌ళం వినిపించింది లేదు. పైగా.. తాను రాజ‌కీయాల క‌న్నా కూడా సినిమాల‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెడ‌తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే.. ఆయ‌న ప్ర‌చారం చేసింది.. పార్టీ త‌ర‌ఫున గ‌ళం వినిపించింది.. కొద్ది రోజులే అయిన‌ప్ప‌టికీ.. ఇటు ప్ర‌జ‌ల్లోనూ.. అటు పార్టీలోనూ ఆయ‌న దూకుడు చూపించారు..

ఫ‌లితంగా.. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి రాజ‌కీయాల్లోకి ఇప్ప‌టికే బాల‌య్య ఉన్నప్ప‌టికీ.. జూనియ‌ర్‌కు టీడీపీ ప‌గ్గాలు ఇస్తే.. ఆయ‌న పార్టీని లైన్‌లో పెడ‌తార‌ని.. ప్ర‌జ‌ల్లోనూ ఆయ‌న‌కు సాను భూతి ఉన్న నేప‌థ్యంతో పాటు.. మాట తీరు.. మ‌ళ్లీ సీనియ‌ర్ ఎన్టీఆర్ ను గుర్తుకు చేస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు పార్టీలోనూ జూనియ‌ర్ మాటే వినిపిస్తోంది. ఏకంగా.. ఇటీవ‌ల రెండు సార్లు కుప్పంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు ముందే.. పార్టీ కార్య‌క‌ర్త‌లు.. జై.. జూనియ‌ర్ అంటూ నినాదాలు చేశారు. ఆయ‌న‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు. త‌ర్వాత కృష్ణాజిల్లాలోనూ.. ఇదే త‌ర‌హా డిమాండ్లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. `నారా నైనై.. జూనియ‌ర్ జైజై`` అనే వాద‌న బ‌లంగా తెర‌మీదికి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఫ్యూచ‌ర్‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి.