Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్‌.. వైఎస్సార్‌సీపీ నేత ఇంటికి నారా లోకేష్‌!

By:  Tupaki Desk   |   28 Sep 2022 7:31 AM GMT
హాట్ టాపిక్‌.. వైఎస్సార్‌సీపీ నేత ఇంటికి నారా లోకేష్‌!
X
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్.. వైఎస్సార్‌సీపీ నేత ఇంటికి వెళ్ల‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో భాగంగా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలోని దేవరపల్లి అగ్రహారం లో పాల్గొన్నారు. అక్క‌డ స్థానిక‌ నేతలతో కలసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అదేవిధంగా లూథరన్ చర్చి లో ప్రత్యేక ప్రార్థన లో పాల్గొన్నారు. వైసిపి పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి ప్రజలకు వివరించారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసి ఛార్జీలు వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తున్న గజ దొంగ జగన్ అని నారా లోకేష్ మండిప‌డ్డారు. ఇచ్చేది గోరంత.. బాదుడే బాదుడు పేరుతో జగన్ దోపిడీ కొండంత అని ధ్వ‌జ‌మెత్తారు.

అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచుకుంటున్నార‌ని లోకేష్ దుయ్య‌బ‌ట్టారు. ప‌న్నుల‌ భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నారా లోకేష్ వైఎస్సార్‌సీపీ నేత ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. దుగ్గిరాల మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ వెనిగళ్ళ శ్రీకృష్ణ ప్రసాద్ నివాసానికి లోకేష్ వెళ్లారు. ఆయ‌న‌ను పరామర్శించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ఫోటోలను నారా లోకేష్ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. నారా లోకేష్ వెంట స్థానిక టీడీపీ నేతలు కూడా ఉన్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓడిపోయిన లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విజ‌యం సాధించాల‌నే ధీమాతో ఉన్నారు. అయితే మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా ఉన్న చేనేత సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను సీఎం జ‌గ‌న్ వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. ఈ క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే మురుగుడు హ‌నుమంత‌రావుకు ఎమ్మెల్సీ ప‌ద‌విని ఇచ్చారు. అదేవిధంగా మ‌రో నేత గంజి చిరంజీవికి వైఎస్సార్సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నారా లోకేష్ పై గంజి చిరంజీవిని దింపే ఉద్దేశంతో జ‌గ‌న్ ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.