Begin typing your search above and press return to search.

వివాదం: లోకేష్ బర్త్ డే చిక్కుల్లో పడింది

By:  Tupaki Desk   |   25 Jan 2016 10:35 AM GMT
వివాదం: లోకేష్ బర్త్ డే చిక్కుల్లో పడింది
X
నాయ‌కుల‌పై అభిమానం చూపేవారు త‌మ ప‌రిధుల‌ను కూడా గుర్తుంచుకోవాలి. ఉత్సాహాన్ని మాత్ర‌మే ప్ర‌ద‌ర్శిస్తూ అస‌లు విష‌యాలను వ‌దిలిపెట్టేస్తే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు ఇపుడు ఆ త‌ర‌హాలోనే వివాదానికి దారితీశాయి.

లోకేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు పండ్ల పంపిణీ - రక్తదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అంతవరకూ బాగానే ఉంది కానీ లోకేష్ పుట్టిన‌రోజును శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో వైభవంగా జరుపుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రాష్ట్ర నాయ‌కుడిగా గుర్తింపు పొందిన వ్య‌క్తి వేడుక‌లు జ‌రుపుకుంటే త‌ప్పేముంది? అనుకోకండి. లోకేష్ బ‌ర్త్‌ డే బాష్ నిర్వ‌హించింది అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం కాదు. లేక‌పోతే ఆస‌క్తి ఉన్న విద్యార్థులు అంతకంటే కాదు. విద్యార్థుల‌కు చ‌దువులు, ఉన్నత విలువలు నేర్పాల్సిన వైస్‌ ఛాన్సలర్లు - రిజిస్ట్రార్లే. స‌ద‌రు పెద్ద సార్లే 'చినబాబు' జన్మదిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు.

ప్రస్తుత వీసీ దామోదరం - రిజిస్ట్రార్‌ దేవరాజులునాయుడు - మాజీ వైస్ చాన్స్‌ల‌ర్‌ లు రామ్మూర్తి, కొలకలూరి ఇనాక్ పాల్గొనడం విశేషం. చదువుల తల్లి ఒడిలో రాజకీయ నేతల పుట్టిన రోజులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఎస్‌వీయులో అధికార పార్టీ నాయకుని జన్మదిన వేడుకలపై ఇపుడు ప్ర‌తిప‌క్షాలు, విద్యార్థి సంఘాలు మండిప‌డుతున్నాయి. వీసీలు ఈ విధంగా స్వామిభక్తిని ప్రదర్శించడం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.