Begin typing your search above and press return to search.

లోకేష్‌ కు మంత్రిప‌దవి...మ‌రికొంత ఆల‌స్యం

By:  Tupaki Desk   |   4 Feb 2017 5:50 AM GMT
లోకేష్‌ కు మంత్రిప‌దవి...మ‌రికొంత ఆల‌స్యం
X
త‌న కుమారుడు - టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్న నారా లోకేష్ కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన ప్ర‌క‌ట‌న కొత్త చ‌ర్చ‌కు ఏమీ దారి తీయ‌న‌ప్ప‌టికీ...ఈ ప్ర‌క్రియ ఎప్పుడు, ఎలా జ‌రుగుతుంద‌నే దానిపై మాత్రం అంత‌ర్గ‌త సంభాషణ‌లు కొన‌సాగుతున్నాయి. బాబు ప్ర‌క‌ట‌న‌లో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి. కార్యకర్తల సంక్షేమనిధికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో లోకేష్‌ కు మరింత కీలక బాధ్యతల అప్పగించాలంటూ కొందరు పార్టీ నేతలు చేసిన సూచనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో ఇక కేబినెట్‌ లో లోకేష్‌ కు స్థానం ఖాయమే నన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆరుమాసాల క్రితం కూడా ఇలాంటి ఊహాగానా లొచ్చాయి. అప్పుడూ ఇప్పుడూ కూడా లోకేష్‌ కు మంత్రిపదవన్న ఏకలక్ష్య అజెండాపైనే ఈ ప్రచారాలు సాగుతున్నాయి. అయితే కేబినెట్‌ విస్తరణ కేవలం లోకేష్‌ చేరికవరకే పరిమితమౌతుందా లేక పునర్‌ వ్యవస్ధీకరణ చేస్తారా అన్న దానిపై ఇప్పుడు విస్తృతంగా ప్రచారం మొదలైంది. అయితే ఈ రెండింటిలో ఏదీ చేప‌ట్టిన‌ప్ప‌టికీ..ఇప్ప‌ట్లో మాత్రం ఉండ‌ద‌ని, క‌నీసం మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇప్పటికే శాఖల వారీగా మంత్రుల పనితీరును వివిధ మార్గాల్లో ముఖ్యమంత్రి సమీకరించారు. వీటన్నింటిని క్రోడీకరించి వారి పనితీరుకు గ్రేడ్‌ లిచ్చారు. అటు ప్రభుత్వం.. ఇటు పార్టీ రెండింటిని సమన్వయం చేసుకుంటూ భవిష్యత్‌ రాజకీయ ప్రయోజనాల్ని కూడా పరిరక్షించగలిగే వార్ని మాత్రమే కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పటికే కొందరు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరునెల‌ల క్రితమే వీరిని తప్పించాలని భావించినప్పటికీ రాష్ట్రంలో పరిస్థితులింకా పూర్తిగా కుదుటపడకపోవడంతో పార్టీలో కొత్త అసమ్మతిని రాజేయడం సరికాదని చంద్రబాబు భావించారు. ఈ ప్రతిపాదనల్ని వాయిదా వేసుకున్నారు. కాగా కొందరుమంత్రులు విపక్షాల ఆరోపణలపై సమర్దవంతంగా స్పందించడంలేదు.. వాటిని తిప్పికొట్టడంలో ఎలాంటి ఆసక్తి ప్రదర్శించడంలేదు. ముగ్గురు నలుగురు మంత్రులపైనే ఈ బాధ్యత పడుతోంది. ఇటీవల విపక్షాల తాకిడి పెరిగింది. గతంలో స్వపక్షంగా ఉన్న జనసేన కూడా ఇప్పుడు తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు మొదలెట్టింది. అయితే మిత్రత్వం చెడిపోకుండా.. అలాగని ఆరోపణలకు బలం చేకూర్చకుండా వీటిపై వివరణ ల్తో కూడిన ఖండనలను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. కీలక పదవుల్లో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో నిత్యం ప్రగతి - అభివృద్ధి ప్రకటనలు తప్ప సమర్ధవంతంగా రాజకీయ దాడిని తిప్పికొట్టడంలేదన్న అసంతృప్తి అధిష్టానంలో కనిపిస్తోంది. అలాగే కొందరు మంత్రులు శాఖాపరంగానూ వైఫల్యాలకు గురౌతున్నారు. ఇదే బృందంతో వచ్చే ఎన్నికల్ని ఎదుర్కొంటే ఫలితాలు అంత సానుకూలంగా ఉండవన్న ఆందోళన కూడా పార్టీలో వ్యక్తమౌతోంది. కనీసం ముగ్గురు - నలుగురినైనా మార్చాలన్న సూచనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే ఇటీవల చంద్రబాబు కొందరు మంత్రుల్ని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఒత్తిళ్ళు - మొహమాటాలు - అంతర్గత అసమ్మతులకు తలొగ్గితే అసలుకే ఎసరొస్తుందన్న భయం కూడా పార్టీ అధిష్టానంలో ఏర్పడినట్లు సంకేతాలు వ‌స్తున్నాయి.

లోకేష్‌ తో పాటు కనీసం ముగ్గురు ఔత్సాహికులకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మహిళా మంత్రి పనితీరు ముఖ్యమంత్రిని సంతృప్తి పర్చలేకపోతోంది. అదే జిల్లాల‌కు చెందిన‌ పార్టీ సీనియర్‌ నాయకులు కేబినెట్లో స్థానం కోసం పట్టుబడుతున్నారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి తీరు పట్ల ముఖ్యమంత్రి బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కర్నూల్‌ జిల్లాలో వైకాపా నుంచి పార్టీలోకొచ్చిన భూమా నాగిరెడ్డి కుటుంబం నుంచి ఒకరికి మంత్రి పదవివ్వాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఈ సంప్రదాయం మంచిదికాదన్న భావం చంద్రబాబులో వ్యక్తమౌతోంది. అలా చూస్తే అంతకంటే ముందే పార్టీని నమ్మి ప్రతిపక్షం నుంచొచ్చిన మరికొందరు సీనియర్లు కూడా పోటీకొచ్చే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. అదీకాక అదే జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి ఇందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో ఆయన అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. నిబంధనల మేరకు కేబినెట్‌ లో మరో ముగ్గురు వరకు అవకాశాలున్నాయి. అయితే కొందర్ని తప్పించి అదనంగా ముగ్గురికి అవకాశం కల్పిస్తే కొత్తగా ఐదునుంచి ఆరుగురికి మంత్రి పదవులొచ్చే అవకాశాలుంటాయి. ఏదైనా మండలి ఎన్నికల అనంతరమే ఈ ప్రక్రియ మొదలెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పెండింగ్‌ లో ఉన్నే మున్సిపల్‌ కార్పొరేషన్లు - మున్సిపాల్టిల ఎన్నికలకు ముందే మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేపట్టాలా లేక వాటి ఫలితాల అనంతరం ఈ దిశగా ప్రయత్నించాలా అన్నదానిపై ఇంకా ఇతమిద్దంగా తేల్చుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/