Begin typing your search above and press return to search.

లోకేష్ కేరాఫ్ వైజాగ్ ... ?

By:  Tupaki Desk   |   28 Feb 2022 3:30 PM GMT
లోకేష్ కేరాఫ్ వైజాగ్ ... ?
X
అవును. ఇది నిజం. టీడీపీ భావి నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు విశాఖ మీద మోజు పెరిగింది.ఆయన విశాఖను వదలను అంటున్నారు. ఇక మీదట వరస టూర్లు ఉంటాయని కూడా అంటున్నారు. అదేంటి సీఎం జగన్ కే కదా విశాఖ మీద అమితాభిమానం. ఇపుడు చిత్రంగా లోకేష్ ఎందుకు టూర్లు పెట్టుకుంటున్నారు అంటే అక్కడే ఉంది అసలు కధ.

లోకేష్ తన మీద తప్పుడు వార్తలు ప్రచురించారు అన్న కారణం మీద కొన్ని మీడియా సంస్థల మీద పరువు నష్టం కేసును విశాఖ కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు తొలి విచారణ‌ ఈ నెల 24న జరిగింది. నాడు లోకేష్ ఫస్ట్ టైమ్ కోర్టుకు వచ్చారు. తిరిగి రెండవ విచారణ 28న జరిగితే దానికి కూడా హాజరయ్యారు. ఇక మరో విచారణ మార్చి 14కి వాయిదా పడింది. దాంతో అపుడు కూడా లోకేష్ బాబు విశాఖ తప్పకుండా వస్తారు అంటున్నారు.

ఇప్పటికి రెండు సార్లు అది కూడా కేవలం నాలుగు రోజుల తేడాలో విశాఖ వచ్చిన లోకేష్ వచ్చిన ప్రతీ సారీ అధికార వైసీపీ మీద జగన్ మీద నిప్పులే చెరిగారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలన మీద ఘాటైన విమర్శలు చేశారు. జగన్ కి అవకాశం ఉంటే కోర్టుని కూడా తాకట్టు పెడతారు అని సెటైర్లు వేశారు.

విశాఖ నుంచి ఎన్నో పెట్టుబడులు తరలివెళ్ళిపోయాయని, తమ హయాంలో అయిదు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఇపుడు ఒక్క జాబ్ అయినా ఇచ్చారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక విశాఖలో అదానీ డేటా సెంటర్ ని తాము తెస్తే అది ముంబై వెళ్ళిపోయిందని, ఏపీలో అప్పులు తిప్పలు తప్ప మరేమీ లేవని కూడా వెటకరం ఆడారు.

తమ మీద తమ కుటుంబం మీద తప్పుడు వార్తలు రాశారని, వాటి మీద పరువు నష్టం కేసు వేశానని, ఇక మీదట జాగ్రత్తగా ఉండకపోతే ఇదే తీరున మరిన్ని కేసులు పెడతామని ఆయన చెప్పారు. తాను కోర్టుకు వస్తున్నాను అంటే జగన్ లా పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించి కాదని, తమ మీద దారుణమైన వార్తలు రాసిన వారి మీద న్యాయపరమైన చర్యల కోసమే వస్తున్నాను అని చెప్పారు.

మొత్తానికి చూస్తే లోకేష్ కూడా కేరాఫ్ వైజాగ్ అయిపోతున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన మరిన్ని సార్లు విశాఖ వస్తారని అంటున్నారు. మరో వైపు తమ్ముళ్లు మాత్రం చినబాబు తరచూ రావడాన్ని స్వాగతిస్తున్నారు. చినబాబు విశాఖకు పదే పదే రావడం ద్వారా పార్టీకి కొత్త జోష్ తెస్తున్నారు అని అంటున్నారు.