Begin typing your search above and press return to search.

విమాన టికెట్లు కొనిస్తా..ఒక్క కంపెనీని అయినా తెస్తారా?

By:  Tupaki Desk   |   23 March 2018 11:18 AM GMT
విమాన టికెట్లు కొనిస్తా..ఒక్క కంపెనీని అయినా తెస్తారా?
X
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విప‌క్ష నేత‌ల‌పై మండిప‌డ్డారు. త‌న స‌హ‌జ శైలికి భిన్నంగా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాకుండా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌తిపాద‌న కూడా చేశారు. అసెంబ్లీలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి భూముల కేటాయింపుపై వచ్చిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ 2014 రాష్ట్ర విభజన సమయానికి 99 శాతం ఐటీ రంగం హైదరాబాద్‌ లో ఉందని - అప్పుడు కేవలం కొన్ని చిన్న కంపెనీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయన్నారు. ఐటీ రంగంలో అభివృద్ధి సాధించిన హైదరాబాద్ - బెంగుళూరు,చెన్నై నగరాలను కాదని ఆంధ్రప్రదేశ్ కు కంపెనీలు రావడానికి అనేక చర్యలు తీసుకున్నామ‌ని, అనేక పాలసీలు తీసుకొచ్చాం - రాయితీలు కల్పిస్తున్నామ‌న్నారు. అయితే దీనిపై విమ‌ర్శ‌లు చేయ‌డం బాధాక‌రంగా ఉంద‌ని లోకేష్ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటుందని అయిన‌ప్ప‌టికీ ఇలాంటి సమయంలో లక్షా ఐటీ - ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నానని లోకేష్ వివ‌రించారు. `ఇప్పటికే 15,550 ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ఉద్యోగాలు కల్పించాం. ఒక్క ఫాక్స్ కాన్ కంపెనీలోనే 14 వేల మంది మహిళలు పని చేస్తున్నారు. త్వరలోనే తిరుపతి లో రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చెయ్యబోతుంది. ఐటీలో 16,583 ఉద్యోగాలు కల్పించాం. ఒప్పందం కుదుర్చుకుని,భూముల కేటాయింపు పూర్తి అయ్యి,పనులు ప్రారంభం అయిన కంపెనీల ద్వారా 27,500 ఉద్యోగాలు రాబోతున్నాయి. మరో 40 వేల ఉద్యోగాల కల్పనకు వివిధ కంపెనీల తో ఒప్పందం చేసుకున్నాం` అని వివ‌రించారు. ఇండియా బీపీఓ స్కీం ద్వారా 19,380 ఉద్యోగాలు కల్పించామ‌న్నారు. హైదరాబాద్ పేరు చెప్పగానే మైక్రోసాఫ్ట్ గుర్తువస్తుందని, అలాంటి పెద్ద కంపెనీలు తీసుకురావాలి అని అనేక ప్రయత్నాలు చేసి ఫలితం సాధించామ‌ని లోకేష్ చెప్పుకొచ్చారు.

విశాఖపట్నంలో ఏర్పాటు అవుతున్న ఐటీ కంపెనీలపై బీజేఎల్పీ నేత విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ మండిప‌డ్డారు. విశాఖపట్నం కు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ - ఏఎన్ ఎస్ ఆర్ - కాన్డ్యూయెంట్ - గూగుల్ ఎక్స్ లాంటి కంపెనీలు వచ్చాయని లోకేష్ వెల్ల‌డించారు. విశాఖలో ఎప్పటి నుండో ఖాళీగా ఉన్న హిల్ 1 - 2కు ఇప్పుడు ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించేందుకు ఐఐటి పాలసీ రూపొందించామ‌ని, అందులో భాగంగా ఫ్రాంక్లిన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి - తాను అమెరికాలోని ఫ్రాంక్లిన్ కంపెనీకి వెళ్లి చర్చలు జరిపి - ఒప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చామ‌ని - వాక్ టూ వర్క్ పద్దతిలో ఫ్రాంక్లిన్ కంపెనీ ఏర్పాటు కాబోతుందన్నారు. 455 కోట్ల పెట్టుబడి -2500 ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. దొంగ అబ్బాయి -దొంగ పేపర్...12 కేసుల్లో ఏ1 గా ఉన్న వ్యక్తి త‌నపై ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ మండిప‌డ్డారు. రాష్ట్రానికి కంపెనీలు రాకుండా, మన యువతి యువకులకు ఉద్యోగాలు రాకుండా చెయ్యాలి అని కుట్రపూరితంగా వార్తలు రాస్తున్నారని దుమ్మెత్తిపోశారు.

దేశంలోనూ - విదేశాల్లోనూ విశ్రాంతి లేకుండా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని ముఖ్యమంత్రి - తాను నిరంతరం కష్టపడుతున్నామ‌ని లోకేష్ చెప్పుకొచ్చారు. `వచ్చే కంపెనీలను అడ్డుకోవాలని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఆరోపణలు,విమర్శలు చేసే వారికి సవాల్ విసురుతున్నాను. మీకు అయ్యే ఖర్చు నేను భ‌రిస్తాను ఎక్కడికైనా వెళ్లి ఒక్క కంపెనీ అయినా తీసుకురాగలరా?` అంటూ స‌వాల్ విసిరారు. ` అలా తెచ్చే కంపెనీల‌కు ఇదే పాలసీలో భూములు కేటాయిస్తాను...21 రోజుల్లో భూములు కేటాయిస్తాను విమర్శలు చేసే వారు ఒక్క కంపెనీ అయినా రాష్ట్రానికి తీసుకురాగలరా? కంపెనీలు రాకుండా అడ్డుపడితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు` అంటూ మంత్రి నారా లోకేష్ మండిప‌డ్డారు.