Begin typing your search above and press return to search.

ఆస్తుల ర‌చ్చ‌కు చ‌ర్చ‌కు సై అంటున్న లోకేష్‌

By:  Tupaki Desk   |   9 March 2017 11:48 AM GMT
ఆస్తుల ర‌చ్చ‌కు చ‌ర్చ‌కు సై అంటున్న లోకేష్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ ఆస‌క్తిక‌ర‌మైన స‌వాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా లోకేష్ స‌మ‌ర్పించిన ఆస్తుల అఫిడ‌విట్‌ లో - గ‌త ఏడాది వారి స్వ‌చ్ఛంద ఆస్తుల ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో విప‌క్షాలు స‌హా మీడియా సైతం ఆస్తుల్లో భారీ పెరుగుద‌ల‌పై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాయి. జాతీయ స్థాయిలో లోకేష్ ఆస్తులు చ‌ర్చ‌నీయాంశం కావ‌డంతో ఆయ‌న స్పందించారు. తన ఆస్తుల ప్రకటనపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారానికి చర్చకు సిద్ధంగా ఉన్నానని నారా లోకేష్ ప్ర‌క‌టించారు. ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలకు లోకేశ్ ఈ స‌వాల్ విసిరారు.

రాజకీయ నాయకుల ఆస్తులకు సంబంధించిన మార్కెట్‌ ధర ప్రకటించాలనేది ఈసీ నిబంధన అని లోకేష్ వివ‌రించారు. దీని ప్ర‌కార‌మే తాను ఆస్తుల వివ‌రాల‌ను ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వెల్ల‌డించిన‌ట్లు లోకేష్ తెలిపారు. అయితే ఈసీ నిబంధనను ప్రతిపక్షం కావాలనే విస్మరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులను స్వచ్ఛందంగా ప్రకటించే తొలి రాజకీయ కుటుంబం తమదేనని, 12 కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత జగన్‌ ఏనాడైనా ఆస్తులు ప్రకటించారా అని లోకేష్‌ ట్విట్టర్ లో ప్రశ్నించారు. జ‌గ‌న్ తీరును అంద‌రూ గ‌మ‌నిస్తున్నార‌ని తెలిపారు.

కాగా,లోకేష్ త‌న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్ ప‌త్రాల్లో త‌న ఆస్తుల మొత్తం విలువ రూ.330 కోట్లని తెలిపారు. లోకేష్‌ ఆస్తులు కేవ‌లం ఐదు నెల‌ల్లో 23 రెట్లు పెర‌గ‌డం గురించి జాతీయ మీడియాలో ప్ర‌ముఖ‌మైన వాటిలో ఒక‌టైన‌ హిందుస్తాన్ టైమ్స్ ప్ర‌త్యేక క‌థ‌నం రాసింది. ఇంత త‌క్కువ స‌మ‌యంలో 23 రెట్లు పెరగ‌డం మైండ్ బ్లోయింగ్ అని అభివ‌ర్ణించింది. లోకేష్ మొత్తం ఆస్తుల్లో రూ.273.84 కోట్ల విలువైన హెరిటేజ్ షేర్లు కూడా ఉన్నాయి. ఇక స్థిరాస్తులు రూ.18 కోట్లు అని, వార‌స‌త్వంగా వ‌చ్చిన‌వి రూ.38.52 కోట్ల‌ని లోకేష్ చెప్పారు. ఇక త‌న పేరిట రూ.6.27 కోట్ల అప్పులు ఉన్న‌ట్లు వెల్లడించారు. అయితే గ‌తేడాది అక్టోబ‌ర్‌ లో ఆయ‌న వెల్ల‌డించిన ఆస్తుల‌కు - ఇప్పుడు ఎన్నిక‌ల క‌మిష‌న్‌ కు ఇచ్చిన వాటికి అస‌లు పొంత‌న లేద‌ని ఆ క‌థ‌నం పేర్కొంది. ఆస్తుల వెల్ల‌డిలో పారద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని చెప్పుకోవ‌డానికి ప్ర‌తి ఏడాది చంద్ర‌బాబు త‌న కుటుంబ స‌భ్యుల ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్నారు. గ‌తేడాది అక్టోబ‌ర్ 19న లోకేష్ ఈ వివ‌రాల‌ను మీడియాకు వివ‌రించారు. అప్ప‌ట్లో త‌న పేరిట ఉన్న ఆస్తుల విలువ‌ను కేవ‌లం రూ.14.5 కోట్లుగా ఆయ‌న చూపించారు. అందులో హెరిటేజ్ షేర్ల విలువ కేవ‌లం రూ.2.52 కోట్లు మాత్ర‌మేన‌ని లోకేష్ చెప్పారు. రూ.1.64 కోట్ల విలువైన ఇత‌ర కంపెనీల షేర్లు - రూ.93 ల‌క్ష‌ల విలువైన కారు - రూ.6.35 కోట్ల అప్పు ఉంద‌ని అప్ప‌ట్లో లోకేష్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/