Begin typing your search above and press return to search.

క్లారిటీ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసేసిన లోకేష్‌

By:  Tupaki Desk   |   17 Nov 2016 10:40 AM GMT
క్లారిటీ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసేసిన లోకేష్‌
X
ఎవ‌రు అవున‌న్నా...కాద‌న్నా... ఏపీ రాజ‌కీయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త‌న‌యుడు- తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీల‌క నాయ‌కుడు. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనే ప‌ద‌వి దీన్ని స్ప‌ష్టం చేస్తోంది. ఇంకా లోతుల్లోకి వెళితే... "నేను ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌ని జాతీయ స్థాయిలో డిమాండ్ వ‌చ్చిన‌పుడు లోకేష్ వ‌ద్దు అని విశ్లేషించి చెప్ప‌డంతో ఆగిపోయాను" అని చంద్ర‌బాబు చెప్ప‌డం లోకేష్ గ్రాఫ్‌ ను మ‌రింత పెంచేసింది. జాతీయ రాజ‌కీయాల‌ను విశ్లేషించి - భ‌విష్య‌త్ ప‌రిణామాల‌ను ప‌సిగ‌ట్ట‌గ‌లిగిన లోకేష్ తాజాగా దేశ‌మంత‌టిని కుదిపేస్తున్న పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలో క్లారిటీ ఇచ్చిన తీరు ఆయ‌న అవ‌గాహ‌న సామ‌ర్థ్యంపై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తుందంటున్నారు. ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని లైట్ తీసుకోమన్న దాదాపు ప‌దేళ్ల క్రిత‌మే చెప్పిన లోకేష్...ప్ర‌స్తుత ప‌రిణామాన్ని విశ్లేషించ‌లేక‌పోవ‌డం ఏమిట‌ని ప‌లువురు అంటున్నారు.

అనంతపురంలో జరిగిన యువ చైతన్య యాత్ర - నవ్యాం ధ్రప్రదేశ్‌ నిర్మాణంలో యువత పాత్ర - విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాల్లో లోకేష్‌ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు డా.పల్లె రఘునాథరెడ్డి - పరిటాల సునీత - కొల్లు రవీంద్ర - ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు - విప్‌ యామినిబాల - జడ్పి చైర్మన్‌ చమన్‌ సాబ్‌ - యువ నేత పరిటాల శ్రీరామ్‌ - ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి - గోనుకుంట్ల సూర్యనారాయణ - అత్తర్‌ ఛాంద్‌ బాషా - వీరన్న - అనంతరాయ చౌదరి - బికె.పార్థసారధి - ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి - ఎమ్మెల్సీలు శమంతకమణి - మెట్టు గోవింధ రెడ్డి - తిప్పేస్వామి - పయ్యావుల కేశవ్‌లు వంటి పార్టీ మ‌హామ‌హులు పాల్గొన్న ఈ స‌మావేశంలో లోకేష్ మాట్లాడుతూ పెద్ద నోట్ల ర‌ద్దు ఎందుకు చేసి ఉంటార‌నేది తాను అంచ‌నా వేయ‌లేక‌పోతున్న‌ట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాత రూ.500 - రూ.1000 నోట్లను రద్దు చేసిన నేప‌థ్యంలో ప్రజలందరూ బ్యాంకుల్లో ఈ పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు పొందే సౌలభ్యం కల్పించిందని లోకేష్ అన్నారు. అయితే రూ.2 వేల నోటును విడుదల చేయడాన్ని తాను కూడా వ్యతిరేకిస్తున్నానన్నారు. రూ.2వేల నోటును తీసుకున్న వారు చిల్లర లబించక పడుతున్న ఇబ్బందులు తాను గమనిస్తున్నానన్నారు. కనుక రూ.2వేల నోటును రద్దు చేసి దాని స్థానంలో రూ. 100 - రూ. 200 నోట్లను ముద్రించి విడుదల చేస్తే బాగుంటుందని కేంద్రాన్ని కోరుతామన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పై మండిప‌డ్డారు. అవినీతి అక్రమాల్లో 20కి పైగా 420 కేసులు ఉండి 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన వైఎస్‌ జగన్‌ నేడు నీతి వాక్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ది కార్య క్రమాలన్నింటినీ అడ్డుకుంటున్నారన్నారు. జగన్‌ అతని పత్రిక ద్వారా దుష్ప్రచారం చేయడమే కాక తనకు - తన తండ్రికి మధ్య చిచ్చుపెడుతున్నారని లోకేష్ వాపోయారు. హోం శాఖ మంత్రి చిన రాజప్ప అడిగిన ప్రశ్నకు తాను సమాధానం ఇస్తుంటే ఆయనను తాను మందలించినట్లు వార్తలు వెలువడ్డాయన్నారు. తాను జగన్‌ మాదిరి వ్యవహరించడం లేదని, తన తాత ఎన్టీ రామారావు - తండ్రి చంద్రబాబు నాయుడుకు చెడ్డ పేరు తేకుండా రాష్ట్ర అబివృద్దికి పాటు పడుతున్నానని లోకేష్ తెలిపారు. ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం ఆదేశం మేరకు ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కేవలం ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలు లభించవని, ప్రత్యేక పన్ను రాయితీలు మాత్రం వర్తించగ లవన్నారు. అయినప్పటికీ ప్రత్యేక హోదాకు దీటుగా కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీ రాగలదన్నారు. 90శాతం నిధులు కేంద్రం భరిస్తుందన్నారు. ఈ నిధులతో రాష్ట్రం ఊహించని విధంగా అభివృద్ది చెందుతుందని లోకేష్‌ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/