Begin typing your search above and press return to search.

విజయమ్మ.. భారతి.. షర్మిల ప్రస్తావన తెచ్చిన చినబాబు

By:  Tupaki Desk   |   14 Jan 2020 5:59 AM GMT
విజయమ్మ.. భారతి.. షర్మిల ప్రస్తావన తెచ్చిన చినబాబు
X
రాజధాని రైతుల కోసం విరాళాలు అంటూ ఓపక్క చంద్రబాబు.. మరోవైపు చినబాబు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఏపీ అధికారపక్షాన్ని విమర్శిస్తూ.. వారిని నిత్యం తప్పు పడుతున్న తండ్రికొడుకులు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు. ఎప్పుడూ లేని రీతిలో తాజాగా గుంటూరులో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ.. ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతి.. జగన్ సోదరి షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు.

రాజధానిలో నిరసనలు నిర్వహిస్తున్న మహిళల్ని పోలీసులు బూటుకాలితో తన్నుతుంటే.. పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారన్న లోకేశ్.. మహిళలకు ఇంత అవమానం జరుగుతుంటే.. విజయమ్మ.. భారతి.. షర్మిలలు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

అమరావతి కోసం తన తల్లి బంగారు గాజులు (ప్లాటినం గాజులని చెబుతున్న స్థానే) ఇస్తే ఎగతాళి చేశారన్నారు. తన తల్లిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన లోకేశ్.. తాము కూడా విజయమ్మ.. భారతి.. షర్మిల మీద కూడా మాట్లాడొచ్చని.. కానీ తమది ఆ సంస్కారం కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు దమ్ముంటే అమరావతి మీద రెఫరెండం చేపట్టాలని సవాలు విసిరారు.

చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చాలానే నిరసనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనలు కూడా చేపట్టారు. మరి.. ఆ రోజు ఆయా అంశాల మీద రెఫరెండం చేయాలన్న ఆలోచన లోకేశ్ బాబుకు ఎందుకు రాలేదు. నాడు తాము చేయని పనిని.. నేడు చేయాలంటూ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. లోకేశ్ మాటల్లోని డొల్లతనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.