Begin typing your search above and press return to search.

వాహ్‌ లోకేష్! ఏం సెప్తిరి ఏం సెప్తిరీ!

By:  Tupaki Desk   |   2 April 2018 5:49 PM GMT
వాహ్‌ లోకేష్! ఏం సెప్తిరి ఏం సెప్తిరీ!
X
తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్ర హక్కులను సాధించడానికి పోరాడడం కోసమే తమ పదవుల్లో ఉన్నారుట. వారు రాజీనామాలు చేసేస్తే ఇక పోరాడేది ఎవరు? హక్కులు సాధించుకునేది ఎలాగ? అని చినబాబుకు పెద్ద సందేహం వచ్చేసింది. కేవలం హక్కులను సాధించాలి గనుక.. వారు రాజీనామాలు చేయడం కరెక్టు కాదనే ఐడియా కూడా ఆయనకు స్పురించింది.

ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేయడంతో పాటూ ఆమరణ నిరాహార దీక్షకు కూడా ఉపక్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదవులను వీడే ఉద్దేశం లేకుండా కేంద్రం మీద ఒత్తిడిపెంచే ఉద్దేశం లేకుండా.. పదవుల్నే అంటిపెట్టుకుని వేళ్లాడుతున్న తెలుగుదేశానికి తమ పరువు కాపాడుకోవడం చాలా క్లిష్టంగా మారుతున్నట్లుంది. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసేస్తే ఇక పోరాడడానికి ఎవ్వరూ ఉండరంటూ చినబాబు.. చిత్రమైన వాదన చేస్తున్నారు.

నిజానికి ఈ వాదన కొత్తది కాదు. చంద్రబాబు ఇదివరలో కూడా చెప్పినదే. చొక్కాలకు నల్ల రిబ్బన్లు పెట్టుకుంటే ప్రత్యేక హోదా వచ్చేస్తుందని.. రాష్ట్రప్రజలను మాయ చేయడానికి చూసే ఈ పార్టీ... ఎంపీలు రాజీనామాలు చేసి.. ఉపఎన్నికల్లో ప్రజాగళాన్ని మరింత గట్టిగా వినిపించడానికి చేసే ప్రయత్నం వల్ల కేంద్రంలో కదలిక రాదని చెప్పడమే వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

‘‘కేంద్రంపై నిలకడగా పోరాటం చేసే సత్తా లేదు. ఉద్దేశం లేదు. కానీ తమ ప్రత్యర్థులు చేసే పోరాటాన్ని మాత్రం నీరుగార్చే మాటలే చెప్పాలి. వారి పోరాటానికి ప్రజల దృష్టిలో విలువ లేకుండా చేయాలి’’ అన్నదే తెలుగుదేశం పార్టీ విధానంగా కనిపిస్తున్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి కుయుక్తులను అంతా గమనిస్తున్నారని.. వాస్తవంలో పోరాటం చేస్తున్నదెవరో.. నాటకాలు ఆడుతున్నదెవరో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యలు వినవస్తున్నాయి.