Begin typing your search above and press return to search.

హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌... లోకేశ్ వల్లేనట!

By:  Tupaki Desk   |   20 Aug 2018 5:59 AM GMT
హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌... లోకేశ్ వల్లేనట!
X
వాజ్‌ పేయ్‌ మృతి తరువాత దేశంలోని నేతలంతా ఆయనకు సంతాపం తెలిపారు. అయితే.. అందరిలోనూ ఏపీ మంత్రి నారా లోకేశ్ సంతాపం మాత్రం చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. ఆయన వాజపేయికి సంతాపం తెలిపారా లేదంటే తన తండ్రి చంద్రబాబు తరఫున డబ్బా కొట్టేందుకు ఆ సందర్భాన్ని ఉపయోగించుకున్నారా అన్నది అర్థం కాక సామాన్య జనం గందరగోళంలో పడిపోయారు.

వాజ్‌ పేయ్‌ కన్నుమూత సందర్భంగా లోకేష్‌ విడుదల చేసిన సంతాప సందేశంపై సోషల్‌ మీడియాలో మూడు రోజులుగా సెటైర్లు పేలుతున్నాయి. సంతాప సందేశంలో వాజ్‌ పేయ్‌ కంటే తన తండ్రి చంద్రబాబు నాయుడినే లోకేష్‌ ఎక్కువగా ప్రస్తావించడంపై నెటిజన్లు ఏకిపడేస్తున్నారు. ఇంతకీ ఈ సంతాప సందేశం ఎవరికి? అంటూ భారీ సెటైర్లేస్తున్నారు. సంతాప సందేశాన్ని కవిత్వంతో ప్రారంభించి చరిత్ర గురించి వివరిస్తూ చివరికి తన తండ్రి పాలన గురించి గొప్పలు చెప్పుకోవడం పట్ల విపరీతంగా వైరల్‌ అవుతోంది. వాట్సాప్ - ఫేస్‌ బుక్ - ట్విట్టర్‌ లో దీనిపై తెగ సెటైర్లు పేలాయి.

లోకేశ్ ఇలా నెటిజన్లకు టార్గెట్ కావడం ఇదే తొలిసారి కాదు. ఆయన ఏం చేసినా చినిగి చాటంత అవుతుంది. అలాంటిది ఆయన ప్రతిభ. తప్పులు మాట్లాడడం - తెలుగు పదాలను సరిగా పలకలేకపోవడం - కంగారులో రివర్స్‌ లో మాట్లాడడంతో లోకేష్‌ నెటిజన్లకు కావాల్సినంత వినోదం అందిస్తుంటారు. అంబేడ్కర్‌ జయంతి సభలో పాల్గొని వర్థంతి అంటూ తప్పుగా మాట్లాడడంతో రెండిటికీ తేడా తెలియని లోకేష్‌ అంటూ విమర్శల వర్షం కురిసింది. మరో సందర్భంలో మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే అంటూ లోకేష్‌ నోరుజారి పార్టీ పరువు తీయడంతో సోషల్‌ మీడియా అంతా జోకులు పేలాయి. ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఇలాగే తడబడడంతో సోషల్ మీడియా ఆయన్ను ఏకిపారేసింది.

సోషల్‌ మీడియాలో చినబాబుపై సెటైర్లు పడుతుండడతో అలా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయించి పలువురిని అరెస్టులు కూడా చేయించినా వీటికి తెరపడటం లేదు. ఆయనపై యూట్యూబ్‌ లో లెక్కలేనన్ని కామెడీ వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. మొత్తానికి మంత్రిగా ఆకట్టుకోలేకపోయినా కామెడీ పండిస్తూ జనాన్ని చినబాబు సంతోషంగా ఉంచుతున్నారంటూ సెటైర్లు పడుతున్నాయి.

అంతేకాదు... సంతోష ఆంధ్రప్రదేశ్ అంటూ చంద్రబాబు కొద్దికాలంగా కొత్త పల్లవి ఎత్తుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పాలన వల్ల ప్రజల్లో సంతోషం రాకపోయినా లోకేశ్ మాటల వల్ల కామెడీ పండి ప్రజలు సంతోషంగా ఉండడం చంద్రబాబు కలలు కంటున్న హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతోందంటున్నారు నెటిజన్లు.