Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : మంగళగిరి నుంచి లోకేష్..కారణమిదే..

By:  Tupaki Desk   |   13 March 2019 8:56 AM GMT
బ్రేకింగ్ : మంగళగిరి నుంచి లోకేష్..కారణమిదే..
X
ఊగిసిలాటకు చెక్ పడింది. మంత్రి నారా లోకేష్ ఎట్టకేలకు ప్రత్యక్ష ఎన్నికల్లో దిగడానికి రెడీ అయ్యారు. ఇన్నాళ్లు విశాఖ నుంచి పోటీచేస్తారని.. కాదు కాదు భీమిలీ నుంచి బరిలోకి దిగతాడని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎట్టకేలకు లోకేష్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు... లోకేష్ కు మంగళగిరి అసెంబ్లీ సీటును ఖాయం చేశారు.

ప్రతి విషయంలోనూ కేసీఆర్ తో పోటీపడే చంద్రబాబు.. కేటీఆర్ లా.. తన కొడుకు లోకేష్ రాజకీయ అరంగేట్రానికి మాత్రం మీనమేషాలు లెక్కించారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఓ వైపు ప్రత్యక్ష ఎన్నికల్లో తాను గెలవడమే కాదు.. ఏకంగా ప్రచార బాధ్యతలు తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. దీంతో లోకేష్ పై ఒత్తిడి పెరిగింది. ఆయన నిరూపించుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి గెలవాల్సిన పరిస్థితి వచ్చింది.

నిజానికి లోకేష్ ఇప్పుడు మంత్రిగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవ్వలేదు. ఎమ్మెల్సీ అయ్యి దొడ్డిదారిని మంత్రి అయ్యారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు తర్వాత అన్నీ తానై నడిపిస్తున్న లోకేష్ కు ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవాల్సిన క్లిష్ట పరిస్థితి ఎదురైంది. అందుకే రాష్ట్రమంతా ఎక్కడైతే గెలుస్తారో ఆ నియోజకవర్గాన్ని శూలశోధన పట్టి చివరకు గుంటూరు జిల్లా మంగళగిరి సరైనదని టీడీపీ అధిష్టానం తేల్చింది. అక్కడి నుంచి ీసీటు ఖాయం చేసింది.

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం.. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై గుంటూరు 20కి.మీల దూరంలో ఉంటుంది. రాజధాని అమరావతి ఉన్న ప్రాంతం. సహజంగానే అభివృద్ధి జరిగింది. దీంతో ఇదే తమకు అవకాశంగా మంగళగిరి నుంచి లోకేష్ ను టీడీపీ బరిలోకి దించుతోంది. టీడీపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడం కూడా లోకేష్ బరిలోకి దించడానికి ఒక కారణంగా తెలుస్తోంది. చూడాలి మరి లోకేష్ బాబు తొలిసారి బరిలోకి దిగి గెలుస్తాడో లేదో..