Begin typing your search above and press return to search.

ఆ వార్త‌కు లోకేశ్ కౌంట‌ర్!!

By:  Tupaki Desk   |   9 Oct 2016 5:18 AM GMT
ఆ వార్త‌కు లోకేశ్ కౌంట‌ర్!!
X
గడిచిన కొద్ది రోజులుగా ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతూ.. తెలుగు నెటిజన్లను దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న ఉదంతంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రియాక్ట్ అయ్యారు. సంస్కారం గురించి మీరా మాట్లాడేది? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై ఓ రేంజ్లో విరుచుకుప‌డ్డారు. సంస్కారం.. సంస్కారం అంటూ తనపై దాడి చేస్తున్న జగన్ పార్టీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేశ్ కు సంస్కారం లేదని.. సీనియర్ నేతలపై పరుష వ్యాఖ్యలు చేసినట్లుగా సాగుతున్న దుష్ప్రచారాన్ని లోకేశ్ ఖండించారు.

ఇంతకూ జరిగిందేమంటే.. విజయవాడ దగ్గర్లోని కేఎల్ యూనివర్సిటీలో ఈ మధ్య పార్టీ శిక్షణ కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు సాగిన ఈ శిక్షణ కార్యక్రమాలకు తొలి రెండు రోజులు హాజరుకాని లోకేశ్.. మూడో రోజు హాజరయ్యరు. ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను ఏకవచనంతో సంబోధించారని.. ఆయనపై పరుష వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని మీడియాలలో వార్తలు వచ్చాయి.

వాటికి మరింత కలర్ వేస్తూ.. ఆన్ లైన్లో లోకేశ్ వ్యవహారశైలిని తప్పు పట్టేలా హెడ్డింగులు పెడుతూ.. కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. చూసినంతనే ఆకర్షించేలా ఉండే ఈ వీడియోల్ని.. ప్లే చేసి చూస్తే.. అందులో లోకేశ్ అభ్యంతరకరంగా మాట్లాడింది ఏమీ లేకున్నా.. ఏదో అనేసినట్లుగా భారీగా ప్రచారం సాగుతోంది. దీన్ని తొలుత మీడియా దుష్ప్రచారంగా వదిలేసినా.. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆన్ లైన్ లో ఈ ఆరోపణల జోరు పెరగిపోవటంతో పార్టీ ముఖ్యల సూచనల నేపథ్యంలో లోకేశ్ రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది.

అయితే.. మీడియాతో నేరుగా మాట్లాడని లోకేశ్.. జగన్ కు లేఖ పేరిట తన వాదనను వినిపించారు. తనకు సంస్కారం లేదంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని.. సీనియర్ నేతల్ని తాను గౌరవిస్తానని పేర్కొన్న లోకేశ్.. జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ‘‘మీ తండ్రితో పని చేసిన సీనియర్ నాయకుల్ని.. మంత్రుల్ని అగౌరవపరిచిన చరిత్ర మీది. అందుకే చాలామంది మిమ్మల్ని.. మీ పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. మీ అహంకారాన్ని భరించలేక వెళ్లిపోతున్నట్లు చాలామంది నాయకులు ఇప్పటికే చెప్పారు. అలాంటి మీరు సంస్కారం గురించి.. పెద్దలకు గౌరవించటం గురించి చెబుతారా?’’ అంటూ ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసే వారికి మండిపోయేలా.. జగన్ మీద తరచూ వినిపించే ఆరోపణల్నే అస్త్రాలుగా చేసుకొని వాటిని లేఖలో గుది గుచ్చి జగన్ ను టార్గెట్ చేశారు.

ఇదిలా ఉండగా.. తనను లోకేశ్ అవమానించినట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రియాక్ట్ అయ్యారు. ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్న ఆయన..స్వయంగా ముఖ్యమంత్రే తనను ఈ రోజు వరకూ ఒక్కమాట అనలేదని.. లోకేశ్ మందలించారంటూ జరుగుతున్న ప్రచారం మొత్తం కుట్రగా అభివర్ణించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/