Begin typing your search above and press return to search.

నాన్న‌లా కౌంట‌ర్ ఏంది చిన‌బాబు?

By:  Tupaki Desk   |   5 Jun 2018 7:27 AM GMT
నాన్న‌లా కౌంట‌ర్ ఏంది చిన‌బాబు?
X
కౌంట‌ర్ అంటే ఎట్లా ఉండాలి. దిమ్మ తిరిగి పోయి బొమ్మ క‌నిపించాలే. అప్ప‌టిక‌ప్పుడు అడిగిన ప్ర‌శ్న‌కు దిమ్మ తిరిగే స్థాయిలో స‌మాధానం చెప్ప‌టం అన్ని వేళ‌లా సాధ్యం కాదు. అలాంటోళ్లు చాలా అరుదుగా ఉంటారు. అందునా.. చిన‌బాబు లోకేశ్ లాంటోళ్ల‌కు ఎంత క‌ష్ట‌మో అర్థం చేసుకోవ‌చ్చు. ఆఫ్ లైన్లో ఇలాంటి క‌ష్టాలు ఉంటాయి కానీ.. ఆన్ లైన్లో ఈ ఇబ్బందులేమీ ఉండ‌వు. అందునా ట్విట్ట‌ర్ లాంటి సోష‌ల్ మీడియాలో పంచ్ వేస్తే.. అవ‌త‌ల‌వాళ్లు కాస్త ఆగి.. ఆలోచించి స‌మాధానం చెప్పేలా ఉండాలి.

కానీ.. తాజాగా చిన‌బాబు చేసిన ట్వీట్ల‌లో ప‌స కంటే న‌సే ఎక్కువ‌గా ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీ ప్ర‌భుత్వ మీద బీజేపీ నేత బీవీఎల్ న‌ర్సింహ‌రావు లాంటి వ్య‌క్తి విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు.. దానికి రిటార్ట్ ఇవ్వాలంటే కాస్తంత స‌మ‌యం.. సంయ‌మ‌నం చాలా అవ‌స‌రం. అదేమీ లేకుండా.. విమ‌ర్శ‌కు ప్ర‌తి విమర్శే అంటే ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఆ చిన్న విష‌యాన్ని లోకేశ్ అర్థం చేసుకున్న‌ట్లుగా క‌నిపించ‌ట్లేదు.

ఏపీ స‌ర్కారు కేంద్రానికి స‌మ‌ర్పించిన యూసీలు స‌రిగా లేవ‌న్న‌ది న‌ర్సింహ‌రావు విమ‌ర్శ‌. అలాంట‌ప్పుడు అందులోని కీ పాయింట్‌ ను ప్ర‌స్తావించి.. ఏపీ స‌ర్కారు త‌ప్పేమీ చేయ‌లేద‌ని చెప్ప‌టంతో పాటు.. ఆ చిన్న‌పాటి అవ‌గాహ‌న లేదా? అంటూ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయాలి. అంతేకానీ.. యూసీలు స‌రిగా లేవ‌ని చెప్ప‌టానికి జీవీఎల్ ఎవ‌రు? అంటూ ప్ర‌శ్నించ‌టంలో అర్థం లేద‌ని చెప్పాలి.

తాము స‌మ‌ర్పించిన యూసీలు స‌రిగా లేక‌పోతే కేంద్రంలోని ఆయా శాఖ‌లు వివ‌ర‌ణ అడుగుతాయి క‌దా? అని అన‌టం కంటే.. మేం కానీ స‌రైన యూసీలు స‌మ‌ర్పించ‌కుంటే కేంద్రంలోని శాఖ‌లు ప్ర‌శ్నించేవి క‌దా? అని ప్ర‌శ్నించినా ఒక ప‌ద్ద‌తి ఉండేది. చిన‌బాబు ట్వీట్ రిప్లై చూస్తే అర్థ‌మ‌య్యేది ఒక‌టే. త‌న తండ్రి చంద్ర‌బాబు బాట‌లో ఆయ‌న న‌డుస్తున్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. ఈ మ‌ధ్య‌న ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో అమిత్ షా ప్ర‌శ్నించ‌టం ఏమిటి? ఆయ‌న ఏ హోదాలో ప్ర‌శ్నిస్తున్నారంటూ త‌ప్పు ప‌ట్టారు. ఇంచుమించు తండ్రి మాదిరే చిన‌బాబు సైతం.. న‌ర్సింహ‌రావు విమ‌ర్శ‌ను త‌న తండ్రి తీరులోనే త‌ప్పు ప‌ట్ట‌టం క‌నిపిస్తుంది.

ప్ర‌త్య‌ర్థి చేసిన విమ‌ర్శ‌ను లోతుగా ప‌రిశీలించి.. అందులోని లోపాన్ని గుర్తించి.. డిఫెన్స్ లో ప‌డేలా చేయాలే త‌ప్పించి.. ఏదో అన్నామంటే అన్నామ‌న్న‌ట్లుగా అంటే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న విష‌యాన్ని లోకేశ్ బాబు గుర్తిస్తే మంచిది. లేకుంటే మ‌రిన్ని విమ‌ర్శ‌లు త‌ప్ప‌వ‌న్న నిజాన్ని గుర్తిస్తే బాగుంటుంది.