Begin typing your search above and press return to search.

లోకేష్ - దేవాన్స్..కరోనా వేళ రోడ్లపై ఆటలేల?

By:  Tupaki Desk   |   18 April 2020 10:38 AM GMT
లోకేష్ - దేవాన్స్..కరోనా వేళ రోడ్లపై ఆటలేల?
X
కరోనా వేళ.. బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు.. తన ప్రజల వద్ద ఉండి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతాడు.. ఇంతటి ఆపత్కాలం వేళ ఏ నాయకుడైనా చేసే పని ఇదే.. అసలు ప్రతిపక్ష నేత అంటే ప్రజల మధ్యలోనే ఉండాలి. కానీ మన ఘనత వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం.. ఏపీ ప్రజలను కరోనాకు వదిలేసి ఎంచక్కా హైదరాబాద్ వెళ్లి సెటిల్ అయిపోయారు. అక్కడే మీడియాతో ముచ్చటిస్తూ ఏపీ పరిస్థితులపై వ్యాఖ్యలుచేస్తూ విమర్శిస్తున్నారు. హైదరాబాద్ లో ఉండి ఏపీ ప్రజల కోసం బాబు గారు పాటుపడడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

పోనీలే పెద్దాయన ముసలోడు అయిపోయాడు.. హైదరాబాద్ లో కరోనా భయానికి ఉండిపోయాడని అనుకుందాం. ఆయన పుత్రరత్నం లోకేష్ కు ఏమైంది? నవ యువకుడైన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ లోకేష్ బాబు అయినా ఏపీ ప్రజల కోసం ఈ కష్టకాలంలో పోరాడవచ్చు కదా.. మరి ఆయనేం చేస్తున్నాడు అంటే.. కరోనా వేళ ఇంట్లో ఉండకుండా హైదరాబాద్ రోడ్లపై సైకిల్ తో షికారు చేస్తున్నాడు. అవును ఇది నిజం..దీనికి ఆధారాలు చిక్కాయి మరీ..

అవును.. హైదరాబాద్ లో ఉన్న లోకేష్ తన తనయుడు దేవాన్స్ తో కలిసి రోడ్ల మీదకొచ్చాడు. లోకేష్ ముఖానికి ఎలాంటి మాస్క్ లేకుండా సైకిల్ పై షికారుకు రాగా.. అతడి పక్కనే అతడి కుమారుడు దేవాన్స్ స్కేటింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఇక వీరిద్దరికీ కాపలాగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మాత్రం ముఖానికి మాస్క్ లతో కరోనా నిబంధనలు పాటించారు. చేతికి గ్లౌజులు వేసుకొని కూడా కనిపించారు.

జనాలకు బాధ్యతగా మాస్కులు ధరించాలని.. రక్షణగా ఉండాలని.. లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ బాబు ఇటీవల మీడియాలో ఊకదంపుడు ఉపన్యాసాలు బాగానే ఇచ్చారు. అయితే ఇవ్వడమే కానీ పాటించడం తమ వల్ల కాదంటూ తాజాగా హైదరాబాద్ రోడ్లపై తిరుగుతూ అడ్డంగా వీడియోలకు చిక్కి నిరూపించారు.

మరి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. హైదరాబాద్ నడిబొడ్డున ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధి అయిన లోకేష్ బాబు ఈ విచ్చలవిడిగా మాస్క్ లు పెట్టుకోకుండా సైకిల్ తొక్కిన వైనంపై ఎలా స్పందిస్తాడో వేచిచూడాలి..

కొసమెరుపు: లోకేష్ సైకిల్ తొక్కుతూ - దేవాన్స్ స్కేటింగ్ చేస్తున్న ఈ వీడియో పాతదని టీడీపీ శ్రేణులు కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవాన్స్ పక్కన - లోకేష్ వెనుకలా రక్షణగా వచ్చిన ఇద్దరు సెక్యూరిటీ పోలీసులు ముఖానికి చేతులకు మాస్క్ లు - గ్లౌజులు ధరించారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు కరోనా టైంలో లాక్ డౌన్ లోనే తీసిందని అర్థమవుతోంది. ఆధారంగా నిలుస్తోంది. మరి బాధ్యత మరిచిన లోకేష్ బాబును ఏం చేయాలో మీరే చెప్పండి.