Begin typing your search above and press return to search.

అలాంటిదేం జరిగినా జగనే ఏ-1 అంటున్న లోకేశ్

By:  Tupaki Desk   |   7 Oct 2015 5:24 AM GMT
అలాంటిదేం జరిగినా జగనే ఏ-1 అంటున్న లోకేశ్
X
శృతి మించిపోతున్న సోషల్ మీడియాలోని వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ జాతీయకమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో అత్యుత్సాహంతో చేసే వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడటమే కాదు.. విపక్ష నేతకు నేరుగా వార్నింగ్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం గుంటూరులో నిర్వహించనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష సందర్భంగా ఏమేం చేయాలో చెబుతూ జగన్ ఫ్యాన్స్ పేరిట కొన్ని కామెంట్లు పెట్టారు. దీనిపై లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీక్ష సందర్భంగా ఏ చిన్న సమస్య ఎదురైనా.. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లేలా చేసి.. అందుకు జగన్ బాధ్యత వహించాలన్న మాట చెప్పటమే కాదు.. ఈ విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.

వైఎస్ జగన్ తోపాటు.. ఆయన శ్రేణులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉన్న లోకేశ్ మాటలు చూస్తే.. ‘‘గుంటూరులో తలపెట్టిన దీక్షకు మద్ధుతుగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు తగలబెడదాం. కలెక్టర్ ఆఫీసులు ధ్వంసం చేద్దాం. ఆత్మహత్యలకు ప్రేరేపిద్దాం’’ అంటే జగన్ పార్టీకి చెందిన నేతలు కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. అలాంటిదేమైనా చేస్తే తమ పార్టీ చూస్తూ ఉరుకోదని స్పష్టం చేశారు.

శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేస్తే.. వాటికి బాధ్యత వహించాల్సిందిగా జగన్ పై కేసులు నమోదు చేయాలని తాము పోరాటం చేస్తామని.. భవనానికి చిన్న అద్దం ముక్క పగిలినా.. దానికి జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒక్క యువకుడి బలవన్మరణం జరిగినా.. జగన్ ను ఏ1 గా చేర్చుతామని చెప్పిన లోకేశ్.. తమ వాళ్లు కానీ కళ్లు తెరిస్తే.. తట్టుకోలేవంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

తన మేనమామ బాలకృష్ణ సినిమాల్లో డైలాగుల మాదిరి.. కంటి చూపుతో కాల్చేస్తానన్న చందంగా.. తమ కార్యకర్తలు కళ్లు తెరిస్తే తట్టుకోలేవంటూ జగన్ పై మాటల తూటాలు సంధించారు. తమకు జగన్ మాదిరి దొంగ ఛానల్.. పేపర్ లేవని.. కాకుంటే 55 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారంటూ చెప్పిన లోకేశ్ మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.