Begin typing your search above and press return to search.

డైటింగ్ కోసమే లోకేష్ దీక్షకు దిగాడా?

By:  Tupaki Desk   |   30 Oct 2019 11:05 AM GMT
డైటింగ్ కోసమే లోకేష్ దీక్షకు దిగాడా?
X
అధికారం ఉన్నప్పుడు కూడా దీక్షలు, నిరసనలు, ఆందోళనలు చేసిన ఘనత మన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని నిరసిస్తూ ఢిల్లీలో, అమరావతిలో కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు సీఎం హోదాలో చేసిన దీక్షలను ఎవ్వరూ మరిచిపోలేదు.

ఇక ఉమ్మడి ఏపీని విభజించిన జూన్ 2న తెలంగాణలో సంబరాలు చేసుకుంటే ఏపీలో మాత్రం చంద్రబాబు అమరావతిలో ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఇదే దీక్షలు కొనసాగించారు. బహుషా సీఎం హోదాలో ఉంటూ ఇలా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపిన ఘనత మన బాబు గారికే సొంతం కావచ్చు..

అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారాక కూడా చంద్రబాబు అండ్ తగ్గడం లేదు. చంద్రబాబు సంగతేమోకానీ తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు కూడా లైన్లోకి వచ్చేశారు. మాటల తూటాలు పేల్చడంలో కాస్త వెనుకబడిన లోకేష్ బాబు.. నిరసనలకు మాత్రం చొరవ చూపిస్తుండడం టీడీపీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.

తాజాగా ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ యువనేత నారా లోకేష్ ఏకంగా గుంటూరులో దీక్షకు దిగారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట లోకేష్ బాబు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తున్నారు. అయితే ఈ దీక్షలపై తాజాగా వైసీపీ స్పందించింది. ప్రభుత్వం చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి... లోకేష్ దీక్షపై హాట్ కామెంట్ చేశారు. ‘లోకేష్ ఇసుక దీక్ష కేవలం డైటింగ్ కోసమే చేస్తున్నట్టుగా ఉంది. గతంలో టీడీపీ ఎంపీలు ఢిల్లీలో జరిగిన వాళ్ల అధినేత చంద్రబాబు దీక్షపై సెటైర్లు వేశారు. చంద్రబాబు ఒళ్లు తగ్గించుకోవడానికే ఈ దీక్షలు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కానే కాదు అని నవ్వులాటగా మాట్లాడడాన్ని ప్రజలు మరిచిపోలేదు’ అని గుర్తు చేశారు.

ఇలా లోకేష్ బాబు రోడ్డు మీదకు వచ్చి దీక్షగా దీక్ష చేస్తుంటే ప్రత్యర్థి వైసీపీ మాత్రం ఇది నారా లోకేష్ డైటింగ్ కోసమే చేస్తున్నాడని విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఇప్పుడు ‘నారా వారి డైటింగ్ దీక్షలు’ వైరల్ గా మారుతున్నాయి. లోకేష్ ఫొటోలు పెట్టి మరీ వారి ప్రత్యర్థులు ఎండగడుతున్నారు.