Begin typing your search above and press return to search.

లోకేష్ ధర్నా: రాష్ట్రంలో తుగ్లక్ పాలన..!

By:  Tupaki Desk   |   30 Aug 2019 6:07 AM GMT
లోకేష్ ధర్నా: రాష్ట్రంలో తుగ్లక్ పాలన..!
X
టీడీపీ ఎమ్మెల్సీ - మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డిపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం ఉదయం లోకేష్ ధర్నాకు దిగారు. పాత బస్టాండ్‌ వద్ద మూతపడిన అన్న క్యాంటీన్‌ ఎదుట బైఠాయించి భవన నిర్మాణ రంగ కూలీలతో కలిసి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వానికి - ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమేకాక - ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే నిర్మాణ రంగ కూలీలు ఇసుక కొరత వల్ల పడుతున్న ఇబ్బందులను వివరించారు. అక్క‌డే ఉన్న ప‌లువురు నిర్మాణ రంగ కార్మికుల‌తో పాటు కొంద‌రు మ‌హిళ‌ల‌తో త‌మ బాధ‌ల‌ను చెప్పించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ పేదల రాజ్యాన్ని జగన్‌ పులివెందులుగా మార్చేశారని ధ్వజమెత్తారు.

మూడు నెలల వైసీపీ పాలనలో రాష్ట్రం మూడేళ్లు వెనక్కి వెళ్లిందని - రాష్ట్రంలో ప్రజలు తుగ్లక్‌ పాలన చూస్తున్నారని చెప్పారు. ఇసుక ధర 9 రెట్లు ఎందుకు పెరిగిందని నిలదీశారు. అమరావతిలో పనులు నిలిచిపోవడంతో వేల మంది ఉపాధి కోల్పోయారన్నారు. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా - ఇసుక కొరతను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు - ధర్నాలు చేపట్టారు.