Begin typing your search above and press return to search.

లోకేష్ స‌భ నుంచి వాకౌట్‌..ఫైర‌యిన మంత్రి

By:  Tupaki Desk   |   23 Jun 2018 1:36 PM GMT
లోకేష్ స‌భ నుంచి వాకౌట్‌..ఫైర‌యిన మంత్రి
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడైన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ కుప్పం పర్యటన ఆయ‌న‌కు అనూహ్య‌మైన అనుబ‌వాల‌ను మిగులుస్తోంది. రెండో రోజు ప‌ర్య‌ట‌న కోసం జిల్లాకు వ‌చ్చిన లోకేష్ మండలాలవారీగా ఏరియా కమిటీ ఇన్‌చార్జిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా యువ‌నేతకు ఓ జెడ్పీటీసీ షాకిస్తే..ఆయ‌న పార్టీ నేత‌ల‌పై క‌స్సుబుస్స‌మ‌న‌డం గ‌మ‌నార్హం. కుప్పం మండల నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ విషయానికైనా ముఖ్యమంత్రి, తన వద్దకు వస్తే వ్యక్తిగత సమస్యలు చెప్తారే తప్ప, ప్రజాసమస్యలు - పార్టీ స్థితిగతులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం చెప్ప‌కుండానే ఆయ‌న భ‌గ్గుమ‌న‌డంపై పార్టీ నేత‌లు సైతం అవాక్క‌య్యారు. ఏకంగా ఓ జెడ్పీటీసీ లోకేష్ తీరును నిర‌సిస్తూ వాకౌట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

కుప్పం రోడ్లు - భవనాలశాఖ అతిథి గృహంలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంత్రి లోకేష్‌ సమన్వయ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాలకు గుడుపల్లె - కుప్పం - శాంతిపురం - రామకుప్పం మండలాలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఒక్కోమండల సమన్వయకమిటీ సభ్యులతో విడిగా పార్టీ స్థితిగతులు - సంక్షేమ పథకాలు - అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు కుప్పంలో అర్ధంతరంగా ఆగిన రహదారి అభివృద్ధికి సంబంధించి 500 మీటర్ల స్థల సమస్యను స్థానిక నేతలు పరిష్కరించ లేకపోవడం ఏమిటని మంత్రి లోకేష్‌ ప్రశ్నించారు. దీంతో కలగజేసుకున్న కుప్పం జడ్పీటీసీ సభ్యుడు రాజ్‌ కుమార్‌ మొదటి విడత రోడ్డు విస్తరణ పనులను దగ్గరుండి చేశామని.. రెండో విడత పనులను కూడా పర్యవేక్షిస్తున్నామని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. కుప్పంలో రహదారి అభివృద్ధికి అడ్డుపడుతున్న వైసీపీ నాయకుల తీరుకు వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టాలని మంత్రి లోకేష్‌ ఆదేశించారు. ఈ సందర్భంలో రెండు.. మూడు దఫాలుగా వివరణ ఇచ్చిన జడ్పీటీసీ సభ్యుడిని మంత్రి లోకేష్‌ తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలిసింది. దీనితో మనస్తాపం చెందిన ఆయన సమావేశం మధ్యలోనే లేచి ఇంటికి వెళ్లిపోవ‌డం పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గ స్తౄయి నేత‌ల భూక‌బ్జాలు - సొంత దందాల‌పై లోకేష్ సీరియ‌స్ అయిన‌ట్లు స‌మాచారం. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే ఊరుకోనని లోకేష్ పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఆయ‌న సూచించాల్సి వ‌చ్చింది. కోట్లాది రూపాయలు సిమెంటు రోడ్ల కోసం మంజూరు చేస్తే కమీషన్లు తీసుకున్నది నాకు తెలుసు.. అవసరం లేని చోట వందల మీటర్లు బంధువుల ఇళ్లకు, సొంత ప్రయోజనాలకు ప్రజాధనం వృథా చేశారు.. అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి’ అంటూ పేర్ల ప్రకారం ఆయన మాట్లాడటంతో పార్టీ కేడర్‌లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. అదే స‌మ‌యంలో... పార్టీలో ఈ స్థాయిలో అవినీతి ఉందా అని ప‌లువురు నేత‌లు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.