Begin typing your search above and press return to search.

మ‌హానాడులో లోకేశ్ మోత మోగిపోతుందిగా

By:  Tupaki Desk   |   27 May 2017 4:53 AM GMT
మ‌హానాడులో లోకేశ్ మోత మోగిపోతుందిగా
X
మ‌రికాసేప‌ట్లో ఏపీ అధికార‌ప‌క్ష తెలుగుదేశం పార్టీ మ‌హానాడు విశాఖ‌లో షురూ కానుంది. టీడీపీ కార్య‌క్ర‌మాలంటేనే హ‌డావుడి ఎక్కువ‌గా ఉంటుంది. ఇక‌.. అధికారంలో ఉన్న‌ప్పుడు నిర్వ‌హించే మ‌హానాడు అంటే.. మోతాదు మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌టం స‌హ‌జం. అందులోకి ఈసారి మ‌హానాడుకు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. బాబు వార‌సుడు లోకేశ్ ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మంత్రి హోదాలో ఆయ‌న మ‌హానాడులో పాల్గొంటున్న వేళ‌.. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు టీడీపీ త‌మ్ముళ్లు ఎంత‌గా పోటీ ప‌డుతున్నార‌న్న విష‌యం.. మ‌హానాడు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు.. ఫ్లెక్సీల‌ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పక త‌ప్ప‌దు.

గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా విశాఖ‌లో నిర్వ‌హిస్తున్న మ‌హానాడులో లోకేశ్ స్తుతి ఎక్కువ‌గా ఉండే అవ‌కాశాలు జోరుగా ఉన్నాయ‌న్న సంకేతాలు బ‌లంగా క‌నిపిస్తున్నాయి. కార్య‌క్ర‌మ‌మానికి ముందుస్తుగా సిద్ధంగా చేసిన మ‌హానాడు ప్రాంగ‌ణాన్ని.. అక్క‌డికి వెళ్లే ర‌హ‌దారులు మొత్తం లోకేశ్ ఫోటోలతో నింపేసిన వైనం చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఒక అంచ‌నా ప్ర‌కారం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు ఫోటోల కంటే కూడా లోకేశ్ ఫోటోలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌న్న మాట ప‌లువురి నోట వినిపించ‌టం గ‌మ‌నార్హం.

దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర్వాత మ‌హానాడును విశాఖ‌లో ఏర్పాటు చేస్తున్నారు. పార్టీని ఎన్టీఆర్ 1982లో స్టార్ట్ చేస్తే. త‌ర్వాతి సంవ‌త్స‌ర‌మే పార్టీ మ‌హానాడును విశాఖ‌లో నిర్వ‌హించారు. త‌ర్వాత 2002లో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న వేళ విశాఖ‌లో నిర్వ‌హించారు. క‌ట్ చేస్తే.. తాజాగా మ‌రోమారు మ‌హానాడుకు విశాఖ ప‌ట్ట‌ణం వేదికైంది.

ఇదిలా ఉంటే.. ఈసారి మ‌హానాడులో లోకేశ్ భ‌జ‌న ఎక్కువైంద‌న్న విమ‌ర్శ జోరుగా వినిపిస్తోంది. తెలుగు త‌మ్ముళ్లు ఎవ‌రికి వారు పోటాపోటీగా లోకేశ్ ఫోటోల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌టం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌హానాడుకు వేదిక అయిన ఏయూ ప్రాంగ‌ణం మొత్తం లోకేశ్ ఫ్లెక్సీల‌తో నిండిపోవ‌టం గ‌మ‌నార్హం. అంతేనా.. విశాఖ న‌గ‌రంలోనూ.. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసిన బ్యాన‌ర్ల‌లో లోకేశ్ ఫోటోలే ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. గ‌తంలో మ‌హానాడు సంద‌ర్భంగా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీవోడు ఫోటోలు ఎక్కువ‌గా క‌నిపించేవి. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ కుమారుడు బాల‌కృష్ణ ఫోటోలు క‌నిపించేవి. అయితే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఎన్టీఆర్‌ కు త‌క్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌టం.. బాల‌య్య ఫోటోలు అస్స‌లు క‌నిపించ‌క‌పోవ‌టం చూసిన‌ప్పుడు మాత్రం ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. పార్టీ వ‌ర్గాల మాట‌ల ప్ర‌కారం.. మ‌హానాడు కోసం త‌యారు చేసే ప్ర‌తి ఫ్లెక్సీ మీదా.. బ్యాన‌ర్ మీదా లోకేశ్ ఫోటో ప్ర‌ముఖంగా క‌నిపించేలా ఉండాల‌న్న మాట పార్టీ అధినాయ‌క‌త్వం నుంచే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు మౌఖికంగా వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. మోతాదు మించిన‌ట్లుగా క‌నిపిస్తున్న లోకేశ్ భ‌జ‌న పార్టీని ఎటు తీసుకెళుతుందో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/