Begin typing your search above and press return to search.

వారంలో 3రోజులు చినబాబు అలా బిజీ

By:  Tupaki Desk   |   30 Sep 2015 4:45 AM GMT
వారంలో 3రోజులు చినబాబు అలా బిజీ
X
తండ్రి చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్నారు ఆయన కుమారుడు లోకేశ్ బాబు. తండ్రి మాదిరే కొన్ని మాటల్ని వల్లె వేయటం లోకేశ్ లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. తన ప్రసంగాలు..మాటలతో పెద్దగా ప్రభావితం చేయలేని చంద్రబాబు తరహాలోనే చినబాబు పయనించటం పార్టీ వర్గాలకు నిరాశ కల్పించే అంశం.

చేసే పనుల గురించి ఆసక్తి రేకెత్తించేలా మాట్లాడటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగా వెనుకబడి ఉంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిత్రమైన విషయం ఏమిటంటే.. లోకేశ్ సైతం అదే తీరులో మాట్లాడటం. తాజాగా తన వీక్ షెడ్యూల్ గురించి చెప్పిన లోకేశ్.. వారంలో మూడు రోజులు ఏపీ తాత్కలిక రాజధాని విజయవాడలో ఉంటానని.. నెలకోసారి తాను దత్తత తీసుకున్న గ్రామంలో పర్యటించనున్నట్లు లోకేశ్ వెల్లడించారు.

కృష్ణా జిల్లా నిమ్మకూరును లోకేశ్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కొమరవోలును తన తల్లి దత్తత తీసుకుందని..ఆ గ్రామ అభివృద్ధి బాధ్యత తాను చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాజాగా కొమరవోలుకు వచ్చిన ఆయన.. తాము దత్తత తీసుకున్న రెండు గ్రామాల్ని తీర్చి దిద్దుతామని.. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు.

వారంలో మూడు రోజులు ఏపీలో.. మరో మూడు రోజులు హైదరాబాద్ లో ఉంటానని గతంలో చెప్పారు. ఇప్పుడు ఈ వీక్ ప్లాన్ లో మార్పులు లేకున్నా.. మంత్ ప్లాన్ లో మరో రోజు దత్తత గ్రామానికి వెచ్చిస్తానంటున్న లోకేశ్.. రానున్న రోజుల్లో ఆయన మంత్లీ ప్లానర్ లో మరెన్ని మార్పలు చోటు చేసుకుంటాయో? వారంలో ఎన్ని రోజులు ఉన్నామన్న దాని కంటే.. ఎంత ప్రభావితం చేయగలుగుతున్నామన్న అంశం మీద లోకేశ్ దృష్టి సారిస్తే బాగుంటుందేమో.