Begin typing your search above and press return to search.

మంగ‌ళ‌గిరికి ఆళ్ల‌!... లోకేశ్ కు అంత ఈజీ కాదు!

By:  Tupaki Desk   |   17 March 2019 9:30 AM GMT
మంగ‌ళ‌గిరికి ఆళ్ల‌!... లోకేశ్ కు అంత ఈజీ కాదు!
X
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగిన తొలిసారే చాలా గ‌ట్టి పోటీని ఎదుర్కోక త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. సొంత ఊరు ఉన్న నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరిని వ‌దిలేసుకుని ఎక్క‌డైతే ఈజీగా గెలుపు ద‌క్కుతుందా? అంటూ నెల‌ల త‌ర‌బ‌డి స‌మీక్ష‌లు, స‌ర్వేలు చేయించుకున్న లోకేశ్... చివ‌ర‌కు న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని ప‌రిధిలోని కీల‌క నియోక‌వ‌ర్గం మంగ‌ళ‌గిరిని ఎంచుకున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం గ‌తంలో టీడీపీకి కంచుకోట‌గానే ఉన్నా... పార్టీ అనుస‌రించిన వ్యూహంతో ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఇత‌ర పార్టీల‌కు మ‌ళ్లిపోయారు. ఇక గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి పోటీ చేసిన వైసీపీ కీల‌క నేత ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి... టీడీపీ అభ్య‌ర్థి గంజి చిరంజీవులు నుంచి గ‌ట్టి పోటీ ఎదురైనా చివ‌ర‌కు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయిన ఆళ్ల‌... నియోజ‌క‌వ‌ర్గాన్ని వైసీపీకి పెట్ట‌ని కోట‌గానే మార్చేశార‌న్న వాద‌న లేక‌పోలేదు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటితోనూ స‌త్సంబంధాలు నెర‌పుతున్న ఆళ్ల‌... అక్క‌డి ఓట‌ర్ల‌కు ఓ కుటుంబ స‌భ్యుడిగానే మారిపోయారు.

అయితే ఈ ద‌ఫా ఆళ్ల‌కు మంగ‌ళ‌గిరి సీటు ద‌క్క‌ద‌ని, ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన వారికి ఈ సారి వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీటు కేటాయిస్తార‌ని ప్ర‌చారం సాగింది. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌గిరి సీటులో ఆళ్ల పోటీలో లేకుంటే... త‌న విజ‌యం ఈజీనేన‌ని లోకేశ్ భావించిన‌ట్టుగా ఉంది. ఆళ్ల‌ను వైసీపీ దూరం పెట్టింద‌న్న విష‌యం తెలియ‌గానే వేగంగా పావులు క‌దిపిన లోకేశ్... మంగ‌ళ‌గిరికి త‌న అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించుకున్నారు. ఇంకేముంది... వెనువెంట‌నే లోకేశ్ ప్ర‌చారంలోకి కూడా దిగిపోయారు. నియోజ‌క‌వ‌ర్గంలోని సెంటిమెంట్‌ కు తాను కూడా పాటిస్తున్న‌ట్లుగా పాన‌కాల స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన లోకేశ్ ప్ర‌చారాన్ని మొద‌లెట్టేశారు. అయితే నేటి ఉద‌యం విడుద‌లైన వైసీపీ జాబితాలో లోకేశ్ కు దిమ్మ‌తిరిగే నిర్ణ‌యం వెలువ‌డిపోయింది. మంగ‌ళ‌గిరి నుంచి వేరే అభ్య‌ర్థి కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామ‌కృష్ణారెడ్డినే బ‌రిలోకి దించుతున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

ఈ ప్ర‌క‌ట‌న విన్నంత‌నే లోకేశ్ షాక్ తిన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆళ్ల లాంటి బ‌ల‌మైన అభ్య‌ర్థిని ఢీకొట్టాలంటే.. అంత ఈజీ ఏమీ కాద‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేసిన లోకేశ్ ... త‌న ప్ర‌చారాన్ని మ‌రింత ముమ్మరం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీ కీల‌క నేత‌గా ఉన్న లోకేశ్ గెలుపు కోసం టీడీపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డే అవ‌కాశాలున్నా... అధికార ప‌క్షానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన ఆళ్ల అంత ఈజీగా ప‌క్క‌కు త‌ప్పుకునే అవ‌కాశాలు కూడా క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా లోకేశ్ ఒక‌టి త‌లిస్తే... దానికి దెబ్బేస్తూ జ‌గ‌న్... లోకేశ్ ను ఓడించే నేత‌నే రంగంలోకి దించేశార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్పుడు మంగ‌ళ‌గిరి సీటుకు జ‌రిగే ఎన్నిక రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌ గా మార‌నుందని చెప్పాలి.