Begin typing your search above and press return to search.

కార్టూనిస్టును హైర్‌ చేసిన చినబాబు

By:  Tupaki Desk   |   14 March 2020 3:30 PM GMT
కార్టూనిస్టును హైర్‌ చేసిన చినబాబు
X
ప్రపంచమంతా రాకెట్‌ స్పీడుతో నడుస్తుంటే తాను మాత్రం సైకిల్‌ మీదే వస్తానంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఊరంతా ఒకదారిలో వెళ్లి - ఉలిపికట్టె మరో దారిలో వెళితే జనం ఎగతాళి చేస్తారని తెలిసినా... నాకు రెండోదారే కరెక్టంటున్నారు. ఇది చదివి మీరు కాస్త అసహనం ఫీలైతే మేమేం చేయలేం. ఎందుకంటే, ఉన్నసంగతే చెబుతున్నాం. ఉలుకు లేకుండా చదవండి.

టీడీపీ - వైసీపీ ఎప్పుడూ ఉప్పు - నిప్పులా చిటపటలాడుతూనే ఉంటాయి. ఒకరిపై మరొకరు విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉంటారు. చినబాబు నారా లోకేశ్‌ కూడా తనవంతుగా ఏదో మాట అంటుంటారు. అయితే ఈ అనేది డైరెక్టుగా అనరు. ట్విట్టర్‌ ద్వారానే మాట్లాడతారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడూ కెమెరాల ముందుకు - మైకుల చెంతకు వచ్చి తన గళాన్ని వినిపించిన చినబాబు... అధికారం పోయాక పూర్తిగా నల్లపూసయ్యారు. డైరెక్టుగా గానీ - టీవీల్లోగానీ అస్సలు కనిపించడం లేదు. ట్విట్టర్‌ లో తప్ప ఆయన మాట వినిపించడం లేదు. మనం మొదట చెప్పుకున్నది సరిగ్గా ఇదే. ఓపక్క వైసీపీ వాళ్లేమో మైకులు పగిలేలా విరుచుకుపడుతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలను సందర్భం సృష్టించుకుని మరీ జనాలకు వివరిస్తున్నారు. ఇలాంటి సమయంలో - సైకిల్‌ కు రెండో చక్రంగా కార్యకర్తలు చెప్పుకునే లోకేశ్‌ ఎలా ఉండాలి..? వైసీపీతో ఢీ అంటే ఢీ అనాలి. నువ్వు తామరాకుతో కొడితే - నేను ముళ్లకంపతో బాదుతా అన్నట్లు రెచ్చిపోవాలి. కానీ, చినబాబు ట్విట్టర్‌ పట్టుకుని వదలడం లేదు.

వైఎస్సార్‌ సీపీని విమర్శిస్తూ.... ఫొటోలు - వీడియోలు ట్విట్టర్‌ లో షేర్‌ చేస్తూ - నిన్నమొన్నటి వరకు కాలక్షేపం చేసిన చినబాబు.. ఇప్పుడు కాస్త రూటు మార్చారు. అలాగని ట్విట్టర్‌ నేం వదిలిపెట్టలేదు. ఫొటోలు వీడియోలకు బదులు కార్టూన్లను షేర్‌ చేయడం మొదలుపెట్టారు. ఇందుకోసం ఓ కార్టూనిస్టును ప్రత్యేకంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆ కార్టూనిస్టు పని వైసీపీ ప్రభుత్వ విధానాల్లో లొసుగులను ఎత్తిచూపడం - టీడీపీ హయాంలో జనం ఎంత హాయిగా ఉన్నారన్న విషయాన్ని నొక్కివక్కాణిస్తూ కార్టూన్‌ గీయడం. శుక్రవారం బీసీ రిజర్వేషన్లపై కార్టూన్‌ గీయించిన లోకేశ్‌ - శనివారం రైతు భరోసాపై గీయించారు. సొంత డబ్బా - పరనిందలా ఉన్న ఆ కార్టూన్లకు రెండు వాక్యాలు కలిపి ట్వీట్‌ చేస్తున్నారు. పేలని ఆ ట్వీట్లు చూసి తెలుగుదేశం టీమ్‌ ఏడ్వలేక నవ్వుతోంది.

అసలు లోకేశ్‌ మైకుల ముందుకు ఎందుకు రావడం లేదు? ట్విట్టర్‌లోనే ఎందుకు బతికేస్తున్నారు అంటే, దానికీ ఓ స్టోరీ ఉంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్‌ మంత్రిగా ఉన్నారు. అప్పుడు చాలాసార్లు మీడియా ముందుకువచ్చి వైసీపీని చెడామడా తిట్టారు. నాలుక తిరక్కో, పరధ్యానంలోనో మాట జారేవారు. అలా ఏదేదో మాట్లాడి ఆయన అభాసుపాలవడమేగాక - పార్టీనీ నడిబజార్లో నిలబెట్టేవారు. వైసీపీకి దొరికిపోయేవారు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి పార్టీ సీనియర్లు రంగప్రవేశం చేయాల్సి వచ్చేది. చినబాబు మైకు ముందుకొచ్చిన ప్రతిసారీ వైసీపీకి ఓ అస్త్రం దొరికినట్లే. అప్పుడంటే అమాత్యులు కాబట్టి ఏదో అలా సాగిపోయింది. మరి ఇప్పుడో.. ఓడలు బండ్లయ్యాయి, బండ్లు ఓడలయ్యాయి. వైసీపీ అధికారంలోకి - టీడీపీ ప్రతిపక్షంలోకి చేరాయి. ఇప్పుడు కూడా మైకుల ముందుకొచ్చి నోరు జారితే ఇంకేమన్నా ఉందా..? దారినబోయే కంపను ఒంటికి తగిలించుకున్నట్లేనంటున్నారు సొంత పార్టీ నేతలు.