Begin typing your search above and press return to search.
సీఎం జగన్‌పై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు?
By: Tupaki Desk | 1 Sept 2022 6:00 PM ISTఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జాతీయ నేర నమోదు సంస్థ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో 2021కి సంబంధించి చోటు చేసుకున్న నేరాలు, టాప్‌లో నిలిచిన రాష్ట్రాల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతుల ఆత్మహత్యలు, సైబర్ నేరాలు, మహిళలపై వేధింపు తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్... జగన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏపీలో నేరాలు ఎక్కువ ఉన్నాయని పేర్కొంటూ ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని కూడా లోకేష్ తన ట్వీట్‌కు జత చేశారు.
జగన్ రెడ్డి గారూ మీ విధ్వంస పాలన దుష్ఫలితాలు వచ్చేశాయి. నేరాలు-ఘోరాలలో గణనీయమైన అభివృద్ధి సాధించడంలో మీరు ఏ1 అని మరోసారి నిరూపించుకున్నారు.
ఆర్థిక నేరాలలో ఆరితేరి 32 సీబీఐ, ఈడీ, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మీ మూడేళ్ల పాలనలో ఆర్థిక నేరాల కేసులు 9273కి పెంచడం మీ ప్రతిభకి నిదర్శనం.
పర్యావరణ నిబంధనలను అతిక్రమించిన కేసులు 2019లో 188 నమోదు కాగా, మీ బ్రాండ్ డిజిట్ ``420`` కేసులకి చేర్చిన మీ ఘనతని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఓ రికార్డుగా గుర్తించింది. 2021లో దేశవ్యాప్తంగా 76 దేశద్రోహం కేసులు నమోదైతే.., అందులో 29 దేశద్రోహం కేసులు నమోదు చేసి మీరు నెంబర్‌వన్‌గా నిలిచారు. అధిక ధరలు, అరాచక పాలన, విధ్వంసం భరించలేక కడుపు మండి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన వారందరిపైనా జగన్ పీనల్ కోడ్ వాడి దేశద్రోహం కేసులు బనాయించారు.
విజనరీ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ అయితే, ప్రిజనరీ జగన్‌రెడ్డి పాలనలో నేరాల్లో నెంబర్‌వన్ అయ్యిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడించిందని లోకేష్ ధ్వజమెత్తారు.
ఇక ఇప్పటికే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వచ్చిన నాటి నుండి జగన్ ప్రభుత్వంపై టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. వైఎస్ జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రతి ఎనిమిది గంటలకు మానభంగాలు, రోజుకు రెండు నుంచి మూడు హత్యలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలపైనా నేరాలు పెరిగాయని టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.