Begin typing your search above and press return to search.

జాతీయ జెండాను అవ‌మానించిన లోకేశ్‌

By:  Tupaki Desk   |   22 Jun 2017 2:58 PM GMT
జాతీయ జెండాను అవ‌మానించిన లోకేశ్‌
X
ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు క‌మ్ ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీరు వివాదాస్ప‌ద‌మైంది. తాజాగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జాతీయ జెండాను అవ‌మానించేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. తిరుప‌తి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన వంద అడుగుల జెండాను ఎగుర‌వేసిన స‌మ‌యంలో లోకేశ్ తీరు.. జాతీయ జెండాను అవ‌మానించేలా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

గురువారం తిరుప‌తి విమానాశ్ర‌యం ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన భారీ జెండా ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా జాతీయ జెండాకు అంద‌రూ వంద‌నం చేసినా.. లోకేశ్ మాత్రం చేయ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులంతా జెండాకు వంద‌నం చేస్తే.. లోకేశ్ మాత్రం అలా నిలుచుండిపోయార‌ని.. ఇది జెండాను అవ‌మానించ‌టం లాంటిదే అన్న విమ‌ర్శ‌ను ప‌లువురు వినిపిస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం జాతీయ జెండాకు వంద‌నం చేయ‌గా.. లోకేశ్ మాత్రం చేయ‌ని వైనం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హార్డ్ వేర్‌.. సెల్ ఫోన్ కంపెనీల‌కు తిరుప‌తి కేరాఫ్ అడ్ర‌స్ గా మారనుంద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా రేణిగుంట‌లో సెల్‌కాన్ మొబైల్ ఫోన్ల యూనిట్‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేశారు. 20 ఎక‌రాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో నెల‌కొల్పిన యూనిట్‌ను బాబు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఇక్క‌డే పుట్టిన వ్య‌క్తి పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగి.. ఇక్క‌డే ప‌రిశ్ర‌మ‌ను పెట్ట‌టం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు.

హార్డ్ వేర్‌.. సెల్ ఫోన్ కంపెనీల‌తో పాటు.. ప‌లు విద్యాసంస్థ‌లు సైతం తిరుప‌తికి వ‌స్తున్నాయ‌ని.. త్వ‌ర‌లో తిరుప‌తి ప‌ట్ట‌ణం.. ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా మారుతుంద‌న్నారు. ఎవ‌రు అడ్డుకున్నా అభివృద్ధిని ఎవ‌రూ ఆప‌లేర‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన నారా లోకేశ్‌.. త‌న చిన్న‌త‌నంలో రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి నారావారిప‌ల్లెకు వెళ్లేవాడిన‌ని.. ఎప్పుడూ కూడా ఈ రోడ్డులో సెల్ కంపెనీ వ‌స్తుంద‌ని తాను ఊహించ‌లేద‌న్నారు. రానున్న రెండేళ్ల వ్య‌వ‌ధిలో ఏడు ల‌క్ష‌ల ఉద్యోగాలు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/