Begin typing your search above and press return to search.

ప్చ్... లోకేష్ ముఖ్యమంత్రా.. !?

By:  Tupaki Desk   |   18 Aug 2018 6:05 PM GMT
ప్చ్... లోకేష్ ముఖ్యమంత్రా.. !?
X
కొన్ని మనుషులతో నిమిత్తం లేకుండా జరిగిపోతాయి. అలాగే వారి హోదా... అర్హత లతో సంబంధం లేకుండా కూడా జరిగిపోతూంటాయి. దానికి కారణం కేవలం వారసత్వమే. అయితే ఈ వారసత్వాన్ని కూడా కొందరు తమ పరిణితితో తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కొందరు మాత్రం వీళ్లు మారరు... ఇంతే అని ప్రజలు అనుకునే వ్యవహరిస్తారు. ఎలా అంటారా... సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడిలా. అదేనండీ నారా లోకేష్‌ లా అన్న మాట. తన రాజకీయ శత్రువు - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమారుడ్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చినట్లుగానే చంద్రబాబు కూడా లోకేష్‌ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. తెలంగాణలో కెసీఆర్ కుమారుడు కెటీఆర్‌ కు కనీసం ఉద్యమ నేపథ్యమైనా ఉంది. లోకేష్‌ కు మాత్రం ఏ అనుభవం లేకుండానే మంత్రి అయ్యారు. ఇది పార్టీలో చాలా మందికి మింగుడు పడని అంశం. సరే, మంత్రిని చేశారు. ఇప్పుడు ఏకంగా ఆయన్ని తన వారసుడిగా ఎక్కడ ముఖ్యమంత్రిని చేసేస్తారో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ మాటకొస్తే ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ భయపడిపోతున్నారు.

మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకూ ఆయన తన ప్రసంగాలతో - చేష్టలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. పోనీలే కొత్త కదా ఆయనే మారతారు అని ఇన్నాళ్లూ చూసిన వారికి ఆయనలో రోజురోజుకి మార్పు రాకపోగా... ఈయనింతే ఇక మారడు అనే భావనే కలుగుతోంది. లేకపోతే ఏ మంత్రి అయినా... ఏ రాజకీయ నాయకుడైనా... కనీసం పంచాయితీ వార్డు మెంబరైనా సరే చేయని పనిని మంత్రి హోదాలో లోకేష్ చేసారు. అదే తన ఇంటి డాబాపై జాతీయ జెండా ఎగురవేయడం. ఇక్కడితో లోకేష్ ఆగితే ఆయన ఎదుగుదలకేముంది. ఇక్కడ కూడా పోలీసుల వందనం. ఇది లోకేష్ అమాయక - తెలియనితనానికి - అధికార వ్యామోహానికి పరాకాష్ట అంటున్నారు తెలుగు ప్రజలు. ఇంతేనా అంటే ఇంకా ఉంది అని అదేదో సినిమాలో అన్నట్లు కూడా అంటున్నారు. అంటే దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌ పేయి సంతాప సందేశంలో లోకేష్ చూపించి తెలివి తేటలు తెలుగు వారిని మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. అటల్ జీ ప్రధానిగా సాధించిన విజయాల్లో తన తండ్రి చంద్రబాబు నాయుడి పాత్ర చాలా ఉందని చెప్పడం. దీనిపై నెటిజన్లు విరుచుకుపడ్డారనుకోండి. ఇంత దారుణమైన - కనీస రాజకీయ అనుభవం కూడా లేని లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయితే ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటో అని తెలుగు వారు కంగారు పడుతున్న మాట కూడా వాస్తవమే. దేవుడున్నాడన్న ఒక్క భరోసా మాత్రమే తెలుగు వారికి కాస్త ఊరట కలిగిస్తోంది.