Begin typing your search above and press return to search.

టీడీపీలో చిచ్చు.. మంత్రి లోకేష్ చ‌ల‌వే!

By:  Tupaki Desk   |   13 Sep 2017 11:49 AM GMT
టీడీపీలో చిచ్చు.. మంత్రి లోకేష్ చ‌ల‌వే!
X
ఏపీలో అధికార టీడీపీకి ప్ర‌త్యేకంగా ఎవ‌రూ శ‌త్రువులు లేర‌ని - మంత్రి లోకేష్ బాబే ప్ర‌థ‌మ శ‌త్రువుగా మారిపోయాడ‌ని - ఆయ‌న నోటి తీట పార్టీకి - ప్ర‌భుత్వానికి కూడా బ్యాడ్ నేమ్ తెస్తోంద‌ని అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. మ‌రికొంద‌రైతే.. ఏపీలో టీడీపీ మునిగిపోవ‌డానికి ఎవ‌రో రాన‌క్క‌ర్లేద‌ని - లోకేష్ చాల‌ని స‌టైర్ల‌తో కుమ్మేస్తున్నారు. మ‌రి విష‌యం ఏంటో చూద్దామా? ఏపీ సీఎం త‌న‌యుడు - ఐటీ మంత్రి లోకేష్‌.. అవ‌డానికి అయితే మంత్రి అయ్యారు కానీ, ఆయ‌నకు ఎప్పుడు ఎక్క‌డ ఎలా మాట్లాడాలో ఇప్ప‌టికీ అస్స‌లు తెలియ‌డం లేదు. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం ప‌రువు పోయింది.

ఇప్పుడు తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ఫ‌లితంగా పార్టీలోనే త‌మ్ముళ్లు ఒక‌రినొక‌రు కుమ్మేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్‌.కోటలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి మంగళవారం మంత్రి లోకేష్ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో వేదికపైనే స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి పనితీరును మెచ్చుకున్నారు. అంత‌టితో ఆగ‌కుండా.. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరోమారు లలితకుమారిని గెలిపించాలని ప్రజలను కోరారు. అంతే.. ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు టీడీపీ కొంప‌ముంచాయి. లోకేష్ మాటలతో స్థానిక టీడీపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు.

కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే హైమావతి - సిట్టింగ్‌ ఎమ్మెల్యే లలితకుమారిల మధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటున్న ప‌రిస్థితి ఉంది. ఫ‌లితంగా ఐదు మండలాల్లో టీడీపీ త‌మ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. తమ వర్గాల్ని నిలుపుకోవాలని, పార్టీ శ్రేణులపై పట్టు సాధించాలని వీరిద్దరూ రాజకీయ మంత్రాంగం నడుపుతూనే ఉన్నారు. ఈ తరుణంలో మంత్రి లోకేష్‌ చేసిన ప్రకటనతో పార్టీలో వర్గవిభేదాలు మరింతగా ముదిరే అవకాశం క‌నిపిస్తోంది. నిజానికి ల‌లిత కుమారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌కుండా చేయాల‌ని హైమావ‌తి ప్ర‌య‌త్నాలు చేసేందుకు రెడీ అవుతున్న త‌రుణంలో లోకేష్ వ్యాఖ్య‌ల‌తో ఆమె అగ్గిమీద గుగ్గిలంలాగా మండిప‌డుతోంది. మొత్తానికి పార్టీలో వ‌ర్గ విభేదాల‌ను తొల‌గించాల్సిన లోకేషే ఇప్పుడు త‌న వ్యాఖ్య‌ల‌తో వీటిని పెంచ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది.