Begin typing your search above and press return to search.

లోకేశా... మరీ ఓవర్ అయిందబ్బా... ?

By:  Tupaki Desk   |   16 Feb 2022 9:32 AM GMT
లోకేశా... మరీ ఓవర్ అయిందబ్బా... ?
X
రాజకీయాల్లో విమర్శలు అన్నవి సహజం. కానీ వర్తమానంలో అవి హద్దులు దాటి ముందుకుపోతున్నాయన్నది వాస్తవం. ఒకరి మీద మరొకరు దారుణమైన ఆరోపణలు చేసుకోవడమే రాజకీయాల్లో పై చేయి సాధించడానికి ఈజీ సాధనం అని నేతాశ్రీలు భావిస్తున్నారు. ఇక అధికార వైసీపీ ఇపుడు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలోటార్గెట్ అవుతోంది. ఈ కేసులో అనుమానితులుగా సీబీఐ చార్జిషీటులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పేర్కొనడంతో ఇది అస్త్రంగా చేసుకుని టీడీపీ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది.

దాంతో సోషల్ మీడియా అయితే గుండె పోటు, గొడ్డలి పోటూ అంటూ టీడీపీ సానుభూతిపరులు ఒక్క లెక్కన హోరెత్తిస్తున్నారు. ఇక నారా లోకేష్ అయితే నిన్నటి నుంచి ట్విట్టర్ కి బాగానే పని చెప్పేశారు. ఆయన వరసబెట్టి జగన్ మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా సూపర్ హిట్ అయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ఒక సీన్ ని వీడియో క్లిప్ గా పెట్టి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో లోకేష్ పోస్ట్ చేశారు. బాబాయ్ మావోడే అబ్బాయ్ మావోడే గొడ్డలి మాదేనంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఉన్న క్లిప్ ఇది.

అంటే దీని అర్ధం తమ సొంత బాబాయిని వైసీపీ పెద్దలే హత్య చేశారన్నట్లుగా ఈ ఆరోపణలు ఉన్నాయి. ఒక విధంగా సీబీఐ చార్జిషీట్ టీడీపీకి అంది వచ్చిన ఆయుధంగా ఉన్నా కూడా నేరుగా కడప ఎంపీ మీద సీబీఐ ఏమీ ఆరోపణలు చేయలేదు. ఆయన ప్రమేయం ఉన్నట్లుగా ఆధారాలు చూపించలేదు. ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది.

అయితే టీడీపీ మాత్రం చాన్స్ దొరికిందే చాలు అన్నట్లుగా జగన్ కే ఈ కేసు ముడిపెట్టి హాట్ హాట్ కామెంట్స్ చేస్తోంది. ఇక లోకేష్ లాంటి టీడీపీ అగ్ర నాయకుడు ఇలా ట్విట్టర్ ద్వారా ఇలాంటి ఆరోపణలు చేయడం పట్ల చర్చ సాగుతోంది. కాస్తా అతి ఎక్కువ అయిందేమో చినబాబూ అని కూడా మరో వైపు కామెంట్స్ పడుతున్నాయి.

టీడీపీ నేతలు అయితే వైఎస్ వివేకా హత్యకు గురైన తరువాత గుండెపోటుతో మరణించినట్లు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసినట్లు విమర్శించారు. వైఎస్ వివేకాది గుండెపోటు కాదని ఆ పార్టీ నేతలు చేసిహ హత్య అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక అంతటితో ఆగకుండా ఈ హత్యలో జగన్ని కూడా లాగుతున్నారు. ఆ విధంగా పొలిటికల్ మైలేజిని సాధించే విషయంలో టీడీపీ దూకుడుగా ఉంది.

నిజానికి ఇప్పటికే కడప జైలు సూపరెండెంట్ గా నియమితులు అయిన వరుణ్ రెడ్డిని తప్పించాలని టీడీపీ డిమాండ్ చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలెర్ట్ అయి ఆయన్ని ఒంగోలుకు బదిలీ చేసింది. ఇది టీడీపీ సాధించిన విజయంగా చెబుతున్నారు.

దాంతో పాటు సీబీఐ చార్జిషీట్ ని ఆధారం చేసుకుని రచ్చ చేయడానికి టీడీపీ రెడీగా ఉంది. మొత్తానికి చూస్తే టీడీపీ ఈ విషయంలో పూర్తి జోరును చూపిస్తోంది. అయినా సరే లోకేష్ మరీ పుష్ప సినిమా సన్నివేశాన్ని వాడేయాలా ఇది ఓవరే సుమా అన్న కామెంట్స్ అయితే పడుతున్నాయి. కానీ టీడీపీ ఆగేట్టు లేదు. ఇది ఎంతదాకా అయినా వెళ్ళేలా ఉంది అన్నది మాత్రం నిజం.