Begin typing your search above and press return to search.

లోకేష్ కృషిని ఢిల్లీ మెచ్చింది

By:  Tupaki Desk   |   3 Dec 2015 7:42 AM GMT
లోకేష్ కృషిని ఢిల్లీ  మెచ్చింది
X
తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పార్టీలో క్రియాశీలంగా మారుతున్నాడు. త‌న‌దైన శైలిలో ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న చేస్తున్న లోకేష్...ఈ క్ర‌మంలో తెర‌మీద‌కు తీసుకువ‌చ్చిన కీల‌క ఆలోచ‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం బాస‌ట‌గా నిలిచేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో సాక్షాత్తు కేంద్ర‌మంత్రి త‌న అంగీకారం తెలిపారు.

విద్యాపరంగా మంచి అర్హతలు ఉన్నప్పటికీ నైపుణ్యం లేనందున అనేకమందికి ఉపాధి లభించటం లేదనేది చేదునిజం. ఈ లోపాన్ని సరిదిద్ది యువ‌త‌లో నైపుణ్యత పెంపొందించటానికి ఎన్టీఆర్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో లోకేష్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఎన్టీఆర్ ట్ర‌స్టు ద్వారా హైదరాబాద్‌ లో 1500 మందికి వివిధ విభాగాలలో శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు వృత్తిపరమైన రంగాలలో శిక్షణ ఇచ్చే ఒక సంస్థతో ట్రస్టు ఒప్పందం కుదుర్చుకొని నైపుణ్యాన్ని మెరుగుపరచటానికి అనుసరించవలసిన విధి విధానాలను రూపొందించింది. ఈ నేప‌థ్యంలో ట్ర‌స్టు కార్య‌కల‌పాల‌ను మ‌రింత విస్త‌రించేందుకు, ఉపాధి కల్పనలో కీలకపాత్ర వహించే నైపుణ్యతను యువతలో పెంపొందించటానికి ఎన్టీఆర్ ట్రస్టు నిర్ణ‌యించింది.

ట్ర‌స్టు చేపట్టిన శిక్షణ కార్యక్రమాల అమలుకు ఆర్థిక సాయం అందించటానికి తెలుగుదేశం ఎంపీలు, ట్రస్టు అధికారులతో కలిసి కేంద్ర స్కిల్ డెవలప్‌ పెంట్ శాఖ మంత్రి రాజీవ్ ప్ర‌తాప్‌ రూడీతో సమావేశ‌మ‌య్యారు. ఈ శిక్షణకు సంబంధించిన వివిధ అంశాలను వివ‌రించారు. ఈ ప్ర‌తిపాద‌న‌ప‌ట్ల ఆస‌క్తి చూపిన స్కిల్ డెవలప్‌ మెంట్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ...ప్రతి నియోజకవర్గానికి మూడుకోట్ల రూపాయలను ప్రాథమికంగా మంజూరు చేయటానికి అంగీకరించారు. ఈ నిధుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో ఏటా మూడువేల మంది యువకులకు స్థానిక అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించటానికి చర్యలు తీసుకుంటారు.

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రూపకల్పన చేసిన ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేయటానికి అవసరమైన ఆర్థిక సాయంతోపాటు సాంకేతికపరమైన సాయాన్ని పై విధంగా కేంద్రం అందిస్తుందని తెలుగుదేశం ఎంపీల బృందం తెలిపింది. ఎంపీలు రాయపాటి సాంబశివరావు - జేసీ దివాకర్ రెడ్డి - గల్లా జయదేవ్ - కింజారపు రామ్‌ మోహన్ నాయుడు - అవంతి శ్రీనివాస్ - మురళీమోహన్‌ తోపాటు ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు - తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మంత్రి రూడీని కలసిన బృందంలో ఉన్నారు.