Begin typing your search above and press return to search.

కేబినెట్ భేటీకి చినబాబు రారు కానీ...

By:  Tupaki Desk   |   18 Oct 2016 5:30 AM GMT
కేబినెట్ భేటీకి చినబాబు రారు కానీ...
X
ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో ఏది ఎలా ఉన్నప్పటికీ.. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చాలా పంక్చువల్‌గా కేబినెట్ సమావేశాలు మాత్రం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కేబినెట్ సమావేశాల వల్ల ప్రతిసారీ ప్రజలకు ఏమైనా మేలు జరుగుతున్నదా? అనే అంశాన్ని పక్కన పెడితే.. కేబినెట్ సమావేశాల మీద నారా లోకేష్ ప్రభావం ఎంత వరకు అనే చర్చ కూడా పార్టీలో ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అయితే కేబినెట్ భేటీకి నేరుగా లోకేష్ రారు కాబట్టి.. కేబినెట్ కు ఆయన పురమాయించదగిన అంశాలేమైనా ఉంటే వాటికోసం ఓ చిన్న అడ్డదారి కనిపెట్టారనే ప్రచారం ఒకటి రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

ఫరెగ్జాంపుల్.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ఉంది. అందులో ఏం విషయాలు చర్చించాలనే దాని గురించి ఓ ఎజెండా కూడా ఉంది. అయితే కేబినెట్ లో మంత్రులకు పురమాయించడానికి అప్రకటిత ఎజెండాలు కూడా ఉంటాయన్నది అందరికీ తెలిసిన సంగతే. నారా లోకేష్ ప్రత్యక్షంగా ఆ బాధ్యత చూసుకోవడానికా అన్నట్లుగా.. కేబినెట్ కు ముందు అంటే మంగళవారం ఉదయం 11.30 గంటలకు పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమన్వయ సమావేశానికి చంద్రబాబు సహా లోకేష్ కూడా హాజరవుతారని, మంత్రులంతా కూడా వస్తారని తెలుస్తోంది. అంటే లోకేష్ స్వయంగా కేబినెట్ లో కూర్చుని సూచనలు చేసే పరిస్థితి ఇంకా రాలేదు గనుక.. ఇలాంటి సమన్వయ కమిటీ సమావేశంలో అప్రకటిత ఎజెండా ఏదైనా ఉంటే దాన్ని పురమాయిస్తాడని అంతా అనుకుంటున్నారు. అంటే ముందు చినబాబుతో భేటీ కావాలని, భోజనం తరవాత పెదబాబుతో భేటీ కావాలని.. ఇద్దరు చెప్పినదానికి తలఊపి వెళ్లాలని నాయకులు అనుకుంటున్నారు.

సమన్వయ సమావేశాల పేరిట నారా లోకేష్ మంత్రులని తనవద్దకు పిలిపించుకుని మాట్లాడడం అనేది ఇటీవలి కాలంలో చాలా తరచుగా జరుగుతూ వచ్చింది. ఈ పోకడపైనే వైఎస్పార్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన తర్వాత.. లోకేష్ మంత్రులను తన వద్దకు పిలిపించుకోవడం కాస్త తగ్గించారు. కాకపోతే ఇవాళ కేబినెట్ కు ముందే పార్టీ సమన్వయ భేటీ - లోకేష్ సమక్షంలో లక్ష్యాల నిర్ణయం ఇవన్నీ ఆ పోకడనే గుర్తుకు తెచ్చేలా ఉన్నాయని పలువురు అనుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/