Begin typing your search above and press return to search.

వరదలు వచ్చినా లోకేష్ మాత్రం కదల్లేదు!

By:  Tupaki Desk   |   21 Aug 2019 11:23 AM GMT
వరదలు వచ్చినా లోకేష్ మాత్రం కదల్లేదు!
X
వరదలు వచ్చినా నారా లోకేష్ ట్విటర్ దాటి రాలేదు.. అనే మాట వినిపిస్తోంది సోషల్ మీడియాలో. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఏపీలో కొంతమేర వరదల ప్రభావం కనిపించింది. కొంతమంది ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. వారికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక రొటీన్ గా ప్రతిపక్షం విమర్శలు చేసింది. వరద బాధితులకు అన్నా క్యాంటీన్లు ఉంటే అన్నం పెట్టేందుకు వీలుండేదని చంద్రబాబు నాయుడు అన్నారు. వరదల గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ఎత్తేయడం గురించి మాట్లాడారు.

వరద బాధితులకు ఏర్పాట్లు అన్నీ సవ్యంగా ఉండటంతో చంద్రబాబు నాయుడు ఇంకేం మాట్లాడాలో తెలీక అన్నా క్యాంటీన్ల రాజకీయాన్ని అందుకున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అన్నారు. వాటికి త్వరలోనే తాము సమాధానం ఇస్తామని వారు అంటున్నారు.

ఆ సంగతలా ఉంటే.. వరదల వేల టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్ మాత్రం కనుచూపు మేరలో కనిపించలేదు. వరదలపై లోకేష్ ఏవేవో ట్వీట్లు పెట్టారు. ఒక చిన్న పడవను అడ్డుపెట్టి కృష్ణా నదిని చంద్రబాబు ఇంటి మీదకు మళ్లించారని లోకేష్ ట్వీటేయడం బాగా విమర్శలకు దారి తీసింది. అలాంటి ట్వీట్లతో లోకేష్ నవ్వులపాలయ్యారని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు వరద బాధితులపై ట్విటర్ తో ఆయన చాలా సానుభూతిని ఒలకపోశారు. అయితే ప్రజలను మాత్రం పలకరించింది లేదు! చంద్రబాబు నాయుడే అలా వచ్చి కొంతసేపు హడావుడి చేసి వెళ్లారు. అయితే లోకేష్ మాత్రం హైదరాబాద్ వీడి రాలేదు.

తనను ఓడించిన ప్రజలకు సేవ చేస్తానంటూ లోకేష్ ప్రగల్బాలు పలికారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా జీవితం ప్రజలకే అంకితమన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. అయితే విపత్తు వేళ కూడా ట్విటర్లో ఏవో రాజకీయాలు చేశారు కానీ, బాధితులను పరామర్శించడానికి మాత్రం లోకేష్ ముందుకు రాలేదు. ట్వీట్లు చేయడమే అయితే అదెవరైనా చేస్తారు. నాయకుడు కావాలనుకుంటే మాత్రం అలా హైదరాబాద్ కు ఇలా ట్విటర్ కు పరిమితం అయితే ప్రయోజనం ఉండదని లోకేష్ విషయంలో తెలుగుదేశం పార్టీ వారే వాపోతుండటం గమనార్హం!