Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ బాబు గాలి తీసేసిన లోకేష్

By:  Tupaki Desk   |   15 Sep 2018 4:48 AM GMT
మ‌ళ్లీ బాబు గాలి తీసేసిన లోకేష్
X
టీడీపీ నేత‌ల్లో మెజార్టీ...బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా ఒక భావ‌న‌ను మాత్రం వ్య‌క్త‌ప‌రుస్తున్నార‌ని ఆ పార్టీ వ్య‌వ‌హారాల‌ను స‌న్నిహితంగా గ‌మ‌నించిన వారు అంటున్నారు. అదే సెల్ఫ్ గోల్ చేసుకోవ‌డం. అలా త‌మ పార్టీని ఇర‌కాటంలో ప‌డేస్తోంది ఎవ‌రో కాదు...సాక్షాత్తు పార్టీ ర‌థ‌సార‌థి చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడైన మంత్రి లోకేష్‌. త‌న ప్ర‌సంగాల‌తో న‌వ్వుల పాలు అవ‌డంలో లోకేష్ గురించి పరిచ‌యం లేద‌నే సంగ‌తి తెలిసిందే. అయితే, అలా మాట్లాడిన స‌మ‌యంలో...త‌న తండ్రిని కూడా ప‌లు ద‌ఫాల్లో ఈ యువ‌నేత ఇర‌కాటంలో ప‌డేశారు. అలా ప‌లు ద‌ఫాల్లో జ‌ర‌గ‌డంతో ఇటీవ‌ల ఆయ‌న మీడియా ముందుకు రావ‌డం మానేశారు, కేవ‌లం ట్వీట్ల‌తో స‌రిపుచ్చారు. అయితే, తాజాగా మీడియాతో మాట్లాడిన యువ‌రాజా వారు బాబు బుక్క‌య్యే ప‌నిచేసేశారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్ త‌న పార్టీ స‌త్తాపై న‌మ్మ‌కంతోటి, భ‌విష్య‌త్ స‌మీక‌ర‌ణాల‌ను లెక్క‌లోకి తీసుకొని హ‌ఠాత్తుగా అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తుకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆయా రాజ‌కీయ ప‌క్షాలు స‌హ‌జంగానే త‌మ‌దైన శైలిలో స్పందించాయి. పార్టీ యువ‌నాయ‌కుడైన లోకేష్ బాబు సైతం తాజాగా స్పందించారు. తెలంగాణ‌లో ముంద‌స్తుకు వెళ్ల‌డం ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ద‌మైన పాల‌న‌లో స‌రైన నిర్ణ‌యం కాద‌ని లోకేష్ వ్యాఖ్యానించారు. ప‌రిపాల‌న‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌గా ప్ర‌భుత్వంను ర‌ద్దు చేయ‌డం బాధ్యతా రాహిత్యమే అని, రాజ్యాంగాన్ని అవమానించడమే అంటూ విరుచుకుప‌డ్డారు. కానీ లోకేష్ ఈ ఆవేశంలోనే బుక్క‌య్యార‌ని అంటున్నారు. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై స్పందిస్తున్న యువ‌కిశోరం త‌న తండ్రి స‌రిగ్గా ఇదే ప‌ని చేశార‌నే విష‌యాన్ని ఎందుకు ప్ర‌స్తావించ‌డం లేద‌ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. 2004లో తనపై అలిపిరిలో అటాక్ జరగగానే.. సానుభూతితో అధికారాన్ని తిరిగి పొంద‌వ‌చ్చ‌ని చంద్రబాబు నాయుడు వెళ్లింది ముందస్తు ఎన్నికలకు కాదా? అంటూ లోకేష్ తీరును ప్ర‌శ్నిస్తున్నారు.

తాము చేస్తే సంసారం, ఎదుట‌వారు అదే ప‌నిచేస్తే..... అన్న‌ట్లుగా తండ్రికొడుకుల వ్య‌వ‌హారం ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల‌ను పార్టీ ఫిరాయిస్తే గ‌గ్గోలు పెట్టిన లోకేష్, ఆయ‌న తండ్రి ఏపీలోనూ అదే ప‌నిచేశార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఇప్పుడు ముంద‌స్తు విష‌యంలోనూ టీడీపీ నేత‌ల వైఖ‌రి అదేన‌ని అంటున్నారు.