Begin typing your search above and press return to search.

విశాఖ‌కు ఐటీ కంపెనీలు అందుకే రావ‌ట్లేద‌ట‌

By:  Tupaki Desk   |   11 Oct 2017 8:56 AM GMT
విశాఖ‌కు ఐటీ కంపెనీలు అందుకే రావ‌ట్లేద‌ట‌
X
`విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో ఐటీ కంపెనీల‌కు నెల‌వుగా విశాఖను తీర్చిదిద్దుతాం. విశాఖ‌లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయ‌డానికి అన్ని వ‌స‌తులు ఉన్నాయి.. రండి ఇక్క‌డ కంపెనీలు ప్రారంభించండి. మీకు కావాల్సిన వ‌స‌తులు అన్నీ మేం స‌మ‌కూరుస్తాం` అని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే కంపెనీల‌ను కోరుతున్నారు. ఏపీకి అత్యంత కీల‌క‌మైన ఐటీ శాఖ‌ను తన‌యుడు లోకేష్‌ కు క‌ట్ట‌బెట్టేశారు. ఆయ‌న కూడా చంద్ర‌బాబుకు ఏమాత్రం తీసిపోవ‌డం లేదు. ఇప్పుడు చంద్ర‌బాబుకు త‌న‌యుడు లోకేష్ పెద్ద షాకే ఇచ్చారు. అన్ని వ‌స‌తులు విశాఖ‌లో ఉన్నాయ‌ని ఆయ‌న‌ చెబుతుంటే.. అబ్బే ఇక్క‌డ వ‌స‌తులు ఎక్క‌డున్నాయి, అందుకే కంపెనీలు రావట్లేదు అంటూ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టేశారు!

`హైద‌రాబాద్‌కు ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది నేనే.. ఐటీకి బ్రాండ్ నేను. హైద‌రాబాద్‌ లానే విశాఖ‌కు కూడా ఐటీ బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తా`నంటున్నారు చంద్ర‌బాబు! ఇక రెండేళ్ల‌లో రెండు ల‌క్ష‌ల ఐటీ ఉద్యోగాలు క‌ల్పించి తీర‌తాం అని బ‌ల్ల‌గుద్దిమ‌రీ చెబుతున్నారు లోకేష్‌! ఐటీ కంపెనీలు విశాఖ‌కు క్యూ క‌ట్ట‌డం ఖాయ‌మ‌ని వీరిద్ద‌రూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. కానీ అనుకున్న స్థాయిలో కంపెనీలు రావ‌డం లేదు.. ఉద్యోగాల ఊసే లేదు. కంపెనీలు ప్రారంభిస్తున్నారు త‌ప్ప.. అందులో కార్య‌క్ర‌మాలు మాత్రం జ‌ర‌గ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో విశాఖ‌లో ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి లోకేష్‌.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

`విశాఖపట్నంలో సోషల్‌ ఎకో సిస్టం లేదు.. డైరెక్ట్‌ ఫ్లైట్లు లేవు.. అంతర్జాతీయ ప్రమాణాలున్న స్కూళ్లూ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు - హైదరాబాద్‌ వంటి నగరాలను వదిలి విశాఖ రావడానికి ఐటీ కంపెనీల వారు సిద్ధంగా లేరు` అని లోకేష్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రైవేటు సంస్థల ఉద్యోగాల్లో స్థానిక కోటా కుదరదన్నారు. అలాంటి కోటా ఉంటే ఏ సంస్థలూ ముందుకు రావని చెప్పారు. విశాఖలో 2014కి ముందు కేటాయించిన స్థలాల్లో కొన్ని ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించలేదని, వాటిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.