లోకేష్ అమెరికా ఎందుకు వెళ్లారు?
By: Tupaki Desk | 6 Nov 2015 3:47 PM GMTతెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అమెరికా వెళ్లారా? వెళితే ఎందుకు వెళ్లారు? అనే చర్చ ఇపుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. లోకేష్ అమెరికా పర్యటన వెనుక అసలు ఉద్దేశం వేరే ఉండి ఉంటుందని కూడా పలువురు అనుమానిస్తున్నారు.
అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో లోకేష్ క్రియాశీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం శ్రేణులు తమ ఇంటి కార్యక్రమంగా భావించి అమరావతి శంకుస్థాపన విజయవంతం అయ్యేలా కృషిచేసేందుకు చెమటోడ్చారు. మరోవైపు తన కుటుంబ కార్యక్రమంలో కూడా బిజీ అయిపోయారు. ముద్దుల కుమారుడు దేవాంశ్ అన్నప్రాసన వేడుకను నిర్వహించడంతో బిజీగా మారిపోయారు. ఈ నేపథ్యంలో స్వల్ప విశ్రాంతి కోసం లోకేష్ అమెరికా పర్యటన పెట్టుకున్నారని సమాచారం.
మరోవైపు లోకేష్ పర్యటన వెనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎజెండా ఉందని తెలుగుదేశం నాయకులు ఘంటాపథంగా చెప్తున్నారు. మై బ్రిక్-మై అమరావతి కార్యక్రమానికి ఎన్నారైల నుంచి పెద్ద ఎత్తున సహకారం తీసుకోవడంలో భాగంగా యూఎస్ పర్యటన పెట్టుకున్నారని వారు వివరిస్తున్నారు. దీంతో పాటు గ్రామాల దత్తత కార్యక్రమాన్ని కూడా మరింత వేగిరం చేసే క్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారని వివరిస్తున్నారు.
మొత్తంగా టీడీపీ యువనేత యూఎస్ టూర్ స్వామికార్యంతో పాటు స్వకార్యంసాధించేందుకు దోహదపడుతుందనేది నిజమని ప్రకటించేస్తున్నారు.