Begin typing your search above and press return to search.

ఏపీతో పోలుస్తూ కేసీఆర్ సర్కారును తిట్టడమా?

By:  Tupaki Desk   |   27 Jan 2016 12:37 PM IST
ఏపీతో పోలుస్తూ కేసీఆర్ సర్కారును తిట్టడమా?
X
తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీకి గ్రేటర్ ఎన్నికల ప్రచారం అంత సులువైన వ్యవహారం కాదు. హైదరాబాదీయుల మనసుల్ని దోచుకోవటం.. హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్ర ప్రాంతీయులు తమ వారేనన్న భరోసా కల్పించటం.. తెలంగాణ సెంటిమెంట్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణ అధికారపక్షాన్ని తిట్టేయటం అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీకి ఉండాల్సిన పరిమితులు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాట్లడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి.

హైదరాబాద్ ను విశ్వనగరంగా పేర్కొంటూ.. అద్భుతమైన నగరంగా తాము మారుస్తామని ఓపక్క తెలంగాణ అధికారపక్షం హామీలు ఇస్తుంటే.. దానికి కౌంటర్ అన్నట్లుగా హైదరాబాద్ విశ్వనగరం తర్వాత.. కనీసం చెత్త ఎత్తటానికి కూడా దిక్కులేదంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడుతున్నారు. గతంలో వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి గల్లీల్లో కూడా అభివృద్ధి చేపట్టినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి మాటలు బాగానే ఉన్నా.. ప్రచార సమయంలో ఏపీ ప్రస్తావన తేవటమే అభ్యంతరకరంగా ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో రూ.16వేల కోట్ల మిగులు ఉన్నా అభివృద్ధి చేయలేకపోతున్నారని.. అదేసమయంలో ఏపీలో రూ.16వేల కోట్ల లోటు ఉన్నా అభివృద్ధి చేస్తున్నట్లు లోకేశ్ చెబుతున్న మాటలు చూసినప్పుడే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో తెలంగాణ గురించి.. మరి ముఖ్యంగా హైదరాబాద్ కు ఏమేం చేయొచ్చన్న విషయాల్ని ప్రస్తావిస్తే బాగుంటుంది కానీ.. ఏపీ ఉదాహరణ తీసుకురావటం ద్వారా రాజకీయ ప్రత్యర్థుల చేతికి అస్త్రాలు ఇచ్చినట్లుగా అవుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. లోకేశ్ ఇలాంటి విషయాల మీద కాస్తంత దృష్టి పెడితే బాగుంటుందేమో.