Begin typing your search above and press return to search.

నోరు తెరిస్తే.. నాలుక మ‌డ‌త ప‌డితే ఎలా చిన‌బాబు!

By:  Tupaki Desk   |   15 March 2019 4:44 AM GMT
నోరు తెరిస్తే.. నాలుక మ‌డ‌త ప‌డితే ఎలా చిన‌బాబు!
X
తెలుగు త‌మ్ముళ్ల‌కు చిన‌బాబు మ‌హా దిగులుగా మారాడు. ఎంట్రీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి మార్పు లేక‌పోవ‌ట‌మే కాదు.. మైకు ప‌ట్టుకుంటే చాలు టీడీపీ శ్రేణుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించ‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా అన్న మాట ఇప్పుడు అంత‌కంత‌కూ పెరుగుతోంది. చేతికి మైకు ఇస్తే చాలు.. టీడీపీ వ‌ర్గాలు వ‌ణికిపోతున్నాయి.

అయ్య‌గారి నోటి వెంట ఏ మాట వ‌స్తుందో.. దాన్ని ఎలా క‌వ‌ర్ చేసుకోవాలో అర్థం కాక టీడీపీ వ‌ర్గాలే కాదు.. వారి అనుకూల మీడియా సైతం ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌.

ఏ అధినేత కొడుకైనా గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి కాస్త భిన్నం కావ‌టంతో ఎమ్మెల్సీ కోటాలో టికెట్ ఇచ్చేసి.. దొడ్డిదారిన త‌న మంత్రివ‌ర్గంలోకి లోకేశ్ ను తెచ్చేసుకున్నారు. దీంతో.. బాబు నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇలాంటివేళ‌.. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను ప్ర‌త్యక్ష ఎన్నిక‌ల బ‌రిలో దింపాల‌ని బాబు డిసైడ్ చేయ‌టంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలుగుదేశానికి ఎప్పుడూ అచ్చిరాని మంగ‌ళ‌గిరి టికెట్ ను లోకేశ్ కు క‌ట్ట‌బెట్ట‌టంపైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా ఉన్న టీడీపీ నేత‌ను బ‌లి చేసి.. లోకేశ్ కు మంగ‌ళ‌గిరి టికెట్ కేటాయించ‌టాన్ని ప‌లువురు త‌మ్ముళ్లు త‌ప్పు ప‌డుతున్నారు. మంగ‌ళ‌గిరి సీటు నుంచి పోటీ చేయ‌టాన్ని మ‌హా గొప్ప‌గా తెలుగు త‌మ్ముళ్లు అభివ‌ర్ణిస్తున్న‌ప్ప‌టికీ.. అంత సీన్ లేద‌ని చెబుతున్నారు.

అమ‌రావ‌తి నేప‌థ్యంలో ఈ సీటులో టీడీపీ గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క కావ‌టంతోనే లోకేశ్ కు ఆ స్థానాన్ని క‌ట్ట‌బెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. వాస్త‌వానికి 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవ‌లం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్య‌ర్థి గంజి చిరంజీవి ఓడిపోయార‌ని.. అలాంటి ఆయ‌న‌కు మ‌రోసారి అవ‌కాశం ఇవ్వ‌కుండా లోకేశ్ ను రంగంలోకి దించుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంపై లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు టీడీపీ వ‌ర్గాల‌కు త‌ల‌నొప్పిగా మారాయి. తాను బ‌రిలో దిగిన నియోజ‌క‌వ‌ర్గం గురించి నాలుగు మాట‌లు చెప్పే విష‌యంలో త‌ప్పులు చేసే లోకేశ్ తీరుకు స్థానికులు ఎలా స్పందిస్తార‌న్న భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ టీడీపీ విజ‌యం సాధించ‌ని నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌మ యువ‌నేత బ‌రిలోకి దిగిన‌ట్లుగా తెలుగుత‌మ్ముళ్లు జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్న‌ప్ప‌టికి అంత సీన్ లేద‌న్న మాట వినిపిస్తోంది.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఏర్పాటు కార‌ణంగా అమితంగా లాభ‌ప‌డిన ప్రాంతాలుగా మంగ‌ళ‌గిరి పేరుంది. దీనికి తోడు.. రాజ‌ధానికి కూత‌వేటు దూరంలో ఉండే మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఉండ‌టం అవ‌స‌ర‌మ‌న్న ఆలోచ‌న‌తోనే ఆయ‌న్ను ఆ స్థానం నుంచి బ‌రిలోకి దింపుతూ టీడీపీ నిర్ణ‌యం తీసుకుంది.

ఇదిలా ఉంటే.. ట్వీట్ల‌తో చెల‌రేగిపోయే లోకేశ్ చేతికి మైకు ఇస్తే మాత్రం ఆయ‌న నాలుక త‌డ‌బ‌డిపోవ‌ట‌మే కాదు.. మడ‌త ప‌డిన‌ట్లుగా త‌ప్పుల మీద త‌ప్పులు మాట్లాడ‌టం క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. బాబు అంచ‌నాల‌కు భిన్నంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉండే మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్ బ‌రిలో నిల‌వ‌టంపై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు చెబుతున్నారు.

గుర్రుగా ఉన్న నేత‌ల్ని ప్ర‌స‌న్నం చేసుకోవ‌టానికి ఇప్ప‌టికే వారి వ‌ద్ద‌కు వెళుతున్న లోకేశ్‌.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేస్తున్న ప్ర‌సంగాల్లో త‌ప్పులు భారీగా దొర్లుతున్న‌ట్లు చెబుతున్నారు. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. 1980 నుంచి టీడీపీ గెల‌వ‌లేద‌ని.. ఇప్పుడు తాను గెలిచేది.. లేనిది ప్ర‌జ‌ల చేతుల్లో ఉంద‌ని చెప్పారు. టీడీపీ పెట్టిందే 1982లో అయితే.. 1980 నుంచి గెల‌వ‌లేదంటూ చెప్పిన మాట‌కు త‌మ్ముళ్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం గురించి కూడా లోకేశ్ త‌ప్పులు మాట్లాడితే తామేం చేయ‌గ‌ల‌మ‌ని వాపోతున్నారు. ట్వీట్స్ విష‌యంలో మ‌హా షార్పుగా ఉన్న‌ట్లు క‌నిపించే చిన‌బాబు.. చేతికి మైకు ఇస్తే మాత్రం నాలుక అదే పనిగా మ‌డ‌త‌ప‌డ‌టం ఎందుకంటారు?