Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ మాట అబద్ధమన్న చినబాబు

By:  Tupaki Desk   |   18 Jan 2017 7:11 AM GMT
ఎమ్మెల్సీ మాట అబద్ధమన్న చినబాబు
X
చేతిలో ఎలాంటి పదవి లేకున్నా అధికారం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుందన్న విమర్శ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీద వినిపించే ప్రధాన విమర్శ.ఇదే విషయాన్ని ఏపీప్రధాన ప్రతిపక్షం పదే పదే ఆరోపిస్తుంది కూడా. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి.. మంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

దీనికి తగ్గట్లే ఈ రోజు పలు ప్రధాన దినపత్రికల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కథనాలు కూడా వచ్చాయి. నిజానికి.. లోకేశ్ లాంటి నేత పొలిటికల్ ఎంట్రీ ఎమ్మెల్సీతో మొదలైతే అంతకుమించిన పెద్ద తప్పు మరొకటి ఉండదు. బాబుకు భవిష్యత్ వారసుడిగా అభివర్ణించే నేత ప్రజలు నేరుగా ఎన్నుకోకుండా.. పరోక్ష ఎన్నిక ద్వారా ఎంపికైతే అది ఆయన పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందికరంగా మారుతుందనటంలో సందేహం లేదు.

అయితే.. దీనికి భిన్నంగా ఏపీ రాజకీయ వర్గాలు లోకేశ్ ఎమ్మెల్సీ అంటూ చెబుతున్న మాటల జోరు ఈ మధ్యన మరింతగా పెరిగి.. పత్రికల్లో ఎక్కే వరకూ వెళ్లాయి. ఈ విషయాన్ని ఇలానే వదిలేస్తే.. మరింత ఇబ్బంది అనుకున్నారో ఏమోకానీ..లోకేశ్ తాజాగా ఈ అంశంపై నోరు విప్పారు. తాను ఎమ్మెల్సీ పదవిని చేపట్టనున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ ఆదేశిస్తే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పదవిని చేపట్టి.. క్యాబినెట్ లో చోటు దక్కించుకోవటం మీద వస్తున్న వార్తలన్ని ఊహాగానాలుగా కొట్టిపారేశారు. అయితే.. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానంటూ..ఒక అప్షన్ ను వదిలిపెట్టటం గమనార్హం. తాజాగా లోకేశ్ మాటలు చూస్తే.. ఆయన ఎమ్మెల్సీ.. ఆ తర్వాత మంత్రి పదవిని చేపట్టటం దాదాపు ఉండకపోవచ్చన్న మాట టీడీపీ సీనియర్ నేతలు కొందరు వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/