Begin typing your search above and press return to search.

నాన్న‌ని పొగుడుతూ..వారిని చిన్న‌బుచ్చ‌ట‌మా?

By:  Tupaki Desk   |   2 Aug 2017 4:36 AM GMT
నాన్న‌ని పొగుడుతూ..వారిని చిన్న‌బుచ్చ‌ట‌మా?
X
ఒక‌రిని పొగ‌డ‌టం కోసం మ‌రికొర‌ని చిన్న‌బుచ్చ‌టం ఎంత‌మాత్రం స‌రికాదు. అందులోకి ఏపీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు.. ఏపీ రాష్ట్ర మంత్రి లోకేశ్ బాబు మాట కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే మాటల్లో తెలీని ఎట‌కారం.. అధికారం తాలుకూ క‌నిపించ‌కూడ‌ని ద‌ర్పం క‌నిపిస్తుంది. ప్ర‌జ‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం ఎంత బాధ్య‌త‌గా ఉందో.. మ‌రెంత జ‌వాబుదారీగా ఉంద‌న్న విష‌యాన్ని వివ‌రించేలా మాట‌లు ఉండాలే కానీ.. అందుకు భిన్నంగా ఉండ‌కూడ‌దు.

తాజాగా చిన‌బాబు మాట‌లు వింటే.. కాసింత ఆవాక్కు కావాల్సిందే. త‌న తండ్రిని పొగిడేసే క్ర‌మంలో ఉద్యోగుల్ని చిన్న‌బుచ్చేలా.. చుల‌క‌న చేసేలా మాట్లాడ‌టం స‌రికాద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి మాట‌లు అదే ప‌నిగా వెంటాడ‌టంతో పాటు.. త‌మ‌ను ఇంత‌గా అవ‌మానిస్తారా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. త‌న తండ్రి టెక్నాల‌జీ ప‌రంగా అప్డేట్ గా ఉంటార‌న్న విష‌యాన్ని చెప్పుకునేందుకు.. బాబుకు హీరోగా అభివ‌ర్ణించేందుకు చాలానే ఉదాహ‌ర‌ణ‌లు చూపించొచ్చు.

కానీ.. వాటి స్థానంలో లోకేశ్ చెప్పిన ఉదాహ‌ర‌ణ‌ల‌ను ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదంటున్నారు. ఇంత‌కూ చిన‌బాబు చెప్పిన ఉదాహ‌ర‌ణ ఏమిటంటే.. గ‌తంలో ప్ర‌భుత్వ యంత్రాంగానికి సాంకేతిక‌త మీద అస్స‌లు అవ‌గాహ‌న ఉండేది కాద‌న్నారు. త‌న తండ్రి పుణ్య‌మా అని మౌస్‌.. విండోస్ లాంటి ప‌దాలు తెలిసాయ‌ని చెప్పుకొచ్చారు.

2004 ముందు తొమ్మిదిన్న‌రేళ్లు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వ యంత్రాంగంలో ఎన్ని మౌస్ లు ఉన్నాయంటే.. స‌చివాల‌యంలో వెతికి ఎలుక‌లు లేవ‌ని చెప్పేవార‌న్నారు. విండోస్ ఎన్ని ఉన్నాయంటే కిటికీలు లెక్క పెట్టేవారంటూ బ‌డాయి క‌బుర్ల‌ను హ‌ద్దులు మీరిన అతిశ‌యంగా చెప్పుకొచ్చారు. నిజానికి కంప్యూట‌ర్లో ఏ విండోస్ ఉంద‌ని అడ‌గ‌టం క‌నిపిస్తుంది కానీ.. విండోస్ ఎన్ని ఉన్నాయంటూ అడిగే వాడు ఎవ‌రైనా ఉంటారా? ఒక‌వేళ అడిగితే.. విండోస్ మీద వ‌ర్క్ చేసే సిస్ట‌మ్స్ ఎన్ని ఉంటాయ‌ని అడిగి ఉంటారు. ఈ మాట‌ను కూడా అర్థం చేసుకోకుండా కిటికీలు లెక్కెట్టి చెప్పేవారంటూ లోకేశ్ చెప్పిన పొగ‌డ్త ప‌లువురిని చిన్న‌బుచ్చేలా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. తండ్రి గొప్ప‌త‌నాన్ని ఏ కొడుకైనా గొప్ప‌గా చెప్పుకోవ‌టం కామ‌న్‌. కానీ.. ఆ క్ర‌మంలో అవ‌త‌ల కొంద‌రిని చిన్న‌బుచ్చుతూ మాట్లాడ‌టం స‌రైన ప‌ద్ధ‌తేనా? అన్న ప్ర‌శ్న వ్య‌క్త‌మ‌వుతోంది. చూస్తుంటే రానున్న రోజుల్లో చిన‌బాబు త‌ప్పుల్లేకుండా మాట్లాడేందుకు శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు కావాల్సిన అవ‌స‌రం ఉందేమో? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.