Begin typing your search above and press return to search.

లోకేశ్ ధర్నా... తాడేపల్లిలో హైటెన్షన్

By:  Tupaki Desk   |   11 April 2019 4:40 PM GMT
లోకేశ్ ధర్నా... తాడేపల్లిలో హైటెన్షన్
X
ఏపీలో ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ఎట్టకేలకు ముగిసింది. నేటి ఉదయం ప్రశాంతం గానే ప్రారంభమైన పోలింగ్ మెజారిటీ ప్రాంతాల్లో ప్రశాంతంగానే ముగిసింది. అయితే పలు ప్రాంతాల్లో ఈవీఎంలలో తలెత్తిన లోపాల కారణంగా కాస్తంత ఆలస్యమైనా... పోలింగ్ అయితే ప్రారంభమైయింది. ఇలా సమస్యలు తలెత్తిన ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయే దాకా కూడా పోలింగ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగానే సాగుతున్నా... కొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - మంత్రి నారా లోకేశ్ నిలబడ్డ మంగళగిరి నియోజకవర్గం కూడా ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మధ్యాహ్నం దాకా మంగళగిరిలో ప్రశాంతంగానే జరిగినా... ఆ తర్వాతే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇందుకు గల కారణాల్లోకి వెళితే... నారా లోకేశ్ ఎంట్రీతోనే ఈ గొడవలు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఉదయమే కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న లోకేశ్... ఆ తర్వాత నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలింగ్ సరళిని పరిశీలించేందుకంటూ ఆయన బయటకు రావడంతోనే పరిస్థితి మారిందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని తాడేపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన లోకేశ్ కు - అక్కడి స్థానిక ఓటర్లతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనివార్య కారణాలతో తాడేపల్లిలో రాత్రి అయినా పోలింగ్ జరుగుతోంది. విషయం తెలుసుకున్న నేపథ్యంలోనే లోకేశ్ అక్కడికి వెళ్లారని సమాచారం. ఈ క్రమంలోనే లోకేశ్ ను అక్కడి స్థానిక ఓటర్లు నిలదీశారని - సమస్యేంటో తెలుసుకునేందుకు వస్తే... తననే అడ్డుకుంటారా? అంటూ లోకేశ్ కూడా ఒకింత అసహనానికి గురైనట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే లోకేశ్ - స్థానిక ఓటర్ల మధ్య మాటా మాటా పెరిగిందని సమాచారం. స్థానికుల నుంచి ఈ తరహా నిరసన వ్యక్తం కావడంతో లోకేశ్ అక్కడే ధర్నాకు దిగాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా లోకేశ్ అక్కడే పోలింగ్ స్టేషన్ కు సమీపంలోనే ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసు బలగాలు హుటాహుటీన అక్కడకు చేరుకున్నాయి. అయితే ధర్నాను విరమించేందుకు లోకేశ్ ససేమిరా అంటుండటం... లోకేశ్ ధర్నాకు నిరసనగా స్థానిక ఓటర్లు - వైసీపీ కార్యకర్తలు కూడా ధర్నాకు దిగడంతో తాడేపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మొత్తంగా ప్రశాంతంగా జరగాల్సిన మంగళగిరి పోలింగ్ లో లోకేశ్ ఎంట్రీతోనే రచ్చ రచ్చ జరగడం ఆసక్తిగా మారిపోయిందని చెప్పాలి.