Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్ర‌చారానికి లోకేష్‌..ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి

By:  Tupaki Desk   |   26 Nov 2018 5:15 PM GMT
తెలంగాణ ప్ర‌చారానికి లోకేష్‌..ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి
X
ఎట్ట‌కేల‌కు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు - ఏపీ మంత్రి లోకేష్ తెలంగాణ ఎన్నిక‌ల‌పై స్పందించారు. తెలంగాణ‌లో హోరాహోరిగా సాగుతున్న ముంద‌స్తు ఎన్నిక‌ల జోరు మొద‌లై రెండు నెల‌లు దాటిపోయిన‌ప్ప‌టికీ - పోలింగ్‌ కు మ‌రో ప‌ది రోజులు కూడా స‌మ‌యం లేన‌ప్ప‌టికీ.....ఇన్నాళ్లు లోకేష్ ఈ ఎన్నిక‌ల గురించి స్పందించ‌ని సంగ‌తి తెలిసిందే. ఓ వైపు ఆయ‌న తండ్రి - టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌లో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకొని మ‌రీ బ‌రిలోకి దిగినా కూడా...ఈ యువ‌నేత మ‌చ్చుకైనా ఈ ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకోలేదు. అయితే, తాజాగా ఆయ‌న ఈ పోరుపై స్పందించారు. అవ‌స‌రం అయితే, తాను ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ‌తాన‌ని అన్నారు.

విశాఖలో సోమ‌వారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదు ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు కృషి అన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ పై ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న వ్యతిరేకత వ్యక్తమవుతోందని వెల్లడించారు. తెలంగాణలో ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభ్యుత్వాన్ని కోరుకుంటున్నారని వివ‌రించారు. ఈ విష‌యం వివిధ రూపాల్లో వెల్ల‌డవుతోంద‌న్నారు. తెలంగాణ‌లో ప్ర‌చారం చేస్తారా అనే ప్ర‌శ్న‌కు ``అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడికైనా ప్రచారానికి వెళ్తా`` అని లోకేష్ సెల‌విచ్చారు.

కాగా, లోకేష్ తండ్రి నారా చంద్ర‌బాబు నాయుడే పార్టీ అధిష్టానం అనే సంగ‌తి తెలిసిందే. త‌న‌యుడు కోరితే...తండ్రి కాద‌న‌లేడు అనేది తెలిసిన సంగ‌తే. అలాటి `ఆదేశించ‌డం` అనే మాట చిత్రంగా ఉందంటున్నారు. పైగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో లోకేష్ విస్తృతంగా ప‌ర్య‌టించిన‌ప్ప‌టికీ - ఆ పార్టీ ఒక్క‌టంటే...ఒక్క‌టే కార్పొరేట‌ర్ సీటును కైవ‌సం చేసుకుంది. త‌ద్వారా లోకేష్ సామ‌ర్థ్యం ఏంటో తేలిపోయింద‌ని పార్టీ వ‌ర్గాలే అనుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో లోకేష్ బాబు చెప్తున్న‌ట్లు ప్ర‌చారం చేయాల‌ని పార్టీ `ఆదేశిస్తుందా?` లేదా లైట్ తీసుకుంటుందా? వేచిచూడాల్సిందే.