Begin typing your search above and press return to search.

నారా లోకేష్‌ అంత మాటన్నారా?

By:  Tupaki Desk   |   16 Nov 2022 12:30 PM GMT
నారా లోకేష్‌ అంత మాటన్నారా?
X
సోషల్‌ మీడియా ప్రజలకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో.. అంతేస్థాయిలో చెడును కూడా మోసుకొస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వారు అనని మాటలను అన్నట్టుగా వారి ఫేక్‌ అకౌంట్లను సృష్టించి ప్రచారం చేస్తుండటం గమనార్హం.

ప్రస్తుతం ప్రజలకు దగ్గరవ్వడానికి అన్ని పార్టీలు, పార్టీల నేతలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంటున్నారు. తమ భావాలను, తమ పర్యటన వివరాలను, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలను వాటిలో పోస్టు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు ఆయా పార్టీల నేతల ఖాతాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. వారు అనని మాటలను అన్నట్టు.. చేయని పోస్టులను చేసినట్టు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఏది నిజమో, అబద్ధమో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. మరోవైపు నేతలకు ఇది సమస్యగా మారుతోంది.

ముఖ్యంగా ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లక్ష్యంగా గతంలోనూ ఫేక్‌ పోస్టులు వెలిశాయి. ఇది వైసీపీ పేటీఎం కార్యకర్తల పనేనని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగానూ నారా లోకేష్‌ ట్వీట్‌ చేసినట్టు గ్రేటర్‌ గుంటూరు టీడీపీ పేరుతో ఒక ఫేక్‌ ట్వీట్‌ చేశారని టీడీపీ మండిపడుతోంది.

అమ్మ ఒడి పనికిమాలిన పథకమని.. మేము గెలిస్తే వెంటనే రద్దు చేసే మొదటి పథకం ఇదే అని నారా లోకేష్‌ అన్నట్టు గ్రేటర్‌ గుంటూరు టీడీపీ పేరుతో ట్వీట్‌ చేసినట్టు ఉంది.

దీనిపైన ఫ్యాక్ట్‌ చెక్‌ టీడీపీ అకౌంట్‌తో ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. ‘‘గెలిస్తే పరిపాలన గాలికొదిలేసి పథకాలు రద్దు చేయడం, పేర్లు మార్చడం, క్యాంటీన్లు మూసేసే నీచమైన రాజకీయం మీది. ఇకనైన ఇలాంటి ఫేక్‌ పోస్టులు ఆపి ముందు ఇనుప కంచెలు లేకుండా మీ తాడేపల్లి అబ్బాయిని జనాల్లో తిరగమనండి చాలు’’ అంటూ టీడీపీ నిప్పులు చెరిగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.