Begin typing your search above and press return to search.

ఆలూ చూలూ లేకుండానే లోకేశ్‌ కు ఆఫర్లు!

By:  Tupaki Desk   |   12 Feb 2018 3:48 PM GMT
ఆలూ చూలూ లేకుండానే లోకేశ్‌ కు ఆఫర్లు!
X
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని సామెత. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఊసు ఇప్పటిదాకా వినిపించనూ లేదు! 2019 ఎన్నికల్లోగా అది జరుగుతుందనే గ్యారంటీ ఎంతమాత్రమూ లేదు. కానీ జిల్లాల్లో నాయకులు మాత్రం.. నియోజకవర్గాల పెంపు అంటూ జరిగితే.. తమ తమ జిల్లాల్లో ఏయే కొత్త సీట్లు వస్తాయి... ఆ సీట్లకు ఇప్పటినుంచి కర్చీఫ్ వేసి పెట్టుకుంటున్న వారు ఎవ్వరు? అనే లెక్కలు సాగిస్తున్నారు. ఇందులో ఇంకొక వెరైటీ ట్విస్టు ఏంటంటే.. నియోజకవర్గాలు పెరుగుతాయో లేదో అంచనా సాగకుండానే.. పెరిగే సీట్లతో కలిపి సమీకరణాలను సిద్ధం చేసేసి.. అందులో నారా లోకేష్ కోసం కొన్ని సీట్లను రిజర్వు చేసేస్తున్నారు. అంటే ఆయన తరఫు కర్చీఫ్ వారే వేసి సిద్ధం చేస్తున్నారన్నమాట.

చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం 14 అసెంబ్లీసీట్లున్నాయి. పునర్విభజన అంటూ జరిగితే 6 సీట్లు పెరుగుతాయనేది అంచనా. నిజానికి ఈ పునర్విభజన వ్యవహారం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది గానీ.. స్థానిక నేతలు మాత్రం అవగాహన లేకపోవడం వల్ల ఎవరికి వారు తమకు తోచినట్లుగా లెక్కలు వేసేసుకుంటున్నారు. 6 సీట్లు పెరిగే అవకాశం ఉండగా.. రకరకాల లెక్కల ప్రకారం.. దాదాపు 8 కొత్త పేర్లను వినిపిస్తూ ఉన్నారు. ఆ 8లోనే ఏదో ఒక 6 సీట్లు ఖరారు అవుతాయనేది వారి అంచనా. అలా గాల్లో లెక్కలు వేసేస్తున్న ఈ నాయకులు.. సందట్లో సడేమియా అన్నట్లుగా పెరగబోయే సీట్లలో నారా లోకేష్ కు కూడా రెండు మూడు నియోజకవర్గాలను రిజర్వుడ్ గా ప్రతిపాదిస్తున్నారు.

ఆ మాటకొస్తే లోకేష్ బరిలోకి దిగతానంటే.. ఎక్కడినుంచైనా తమ సీటు ఖాళీ చేసి ఇవ్వడానికి అత్యుత్సాహం ప్రదర్శించే వారు మెండుగానే ఉంటారు. కానీ.. ఆయనను చిత్తూరు జిల్లాలోనే బరిలో ఉంచాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. చిత్తూరు నియోజకవర్గంలోనే గానీ, మరో చోట గానీ.. పోటీచేయించాలని అనుకుంటున్నారుట. ఆయనను పలమనేరు నియోజకవర్గానికి ఆహ్వానిస్తూ.. మంత్రి అమర్ నాధ్ రెడ్డి త్యాగానికి కూడా సిద్ధమవుతున్నారుట. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన పుంగనూరుకు వెళ్తా అంటున్నారుట.

మొత్తానికి చిత్తూరు అయినా, పలమనేరు అయినా.. (పునర్విభజన జరిగినా జరగకున్నా) కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నారా చంద్రబాబునాయుడు ప్రభావం ప్రసరించే ప్రాంతంలోనే తనయుడు లోకేష్ కూడా రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లుంది. ఈ రెండింటిలో ఏదైనా సరే.. అది కుప్పంతో పాటూ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలోనే ఉంటుంది. మొత్తానికి తండ్రి చాటు బిడ్డగానే విజయం సాధించడానికి ఈ ఎన్నికల సమయానికి లోకేష్ సమాయత్తం అవుతున్నట్లుంది.