Begin typing your search above and press return to search.

లోకేష్ ట్విటర్లో అయితే తగ్గడం లేదు!

By:  Tupaki Desk   |   28 Jun 2019 8:11 AM GMT
లోకేష్ ట్విటర్లో అయితే తగ్గడం లేదు!
X
వరస ట్వీట్లతో ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు టీడీపీ నేత - ఎమ్మెల్సీ లోకేష్ బాబు. చంద్రబాబు హయాంలోని అంశాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణకు రంగం సిద్ధం చేస్తూ ఉండగా.. లోకేష్ తెగ స్పందించేస్తూ ఉన్నారు. జగన్ ను ఏవన్ అని - విజయసాయి రెడ్డిని ఏ టు అంటూ పాత డైలాగులే వల్లె వేస్తూ ఉన్నాడు లోకేష్. ఇవే మాటలను మీడియా ముందుకు వచ్చి లోకేష్ తడుముకోకుండా చెబితే ఆయన వాదన ఏమిటో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అయితే లోకేష్ మాత్రం ట్విటర్ దాటడం లేదు! మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం చెప్పుకొచ్చారంటే!

'' నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా.. అక్రమాస్తుల కేసులో ఏ1 గారు అవినీతిపై కమిటీ వేశారు. ఏ2 గారు విచారణ చేస్తారట! కలికాలం కాకపోతే అక్రమాల విక్రమార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడటమా!!

వైఎస్ గారి హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్ రూ.14కి కొంటే - టీడీపీ హయాంలో రూ. 2.70 యూనిట్ కొన్నారు. మీ నాయనగారి నిర్వాకంతో డిస్కంలకు రూ. 8 వేలకోట్లు నష్టం వచ్చింది. ఈ ఉదాహరణలు చాలవా - ఎవరు మహానేతో! ఎవరు దార్శనిక నేతో తెలుసుకోడానికి.

అన్నయ్యలూ నాకేం తెలియదంటూనే ఎలాంటి విచారణ జరగకుండా - కనీస ఆధారాలు లేకుండా 2,636 కోట్లు అవినీతి జరిగిందని తేల్చారు. గుడ్డ కాల్చి వెయ్యడంలో మీకు మీరే సాటి జగన్ గారు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్తు నుండి మిగులు విద్యుత్తు సాధించి 5 ఏళ్లలో 150కి పైగా అవార్డులు సాధించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు అంటూ పెట్టుబడులు అడ్డుకొని రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని స్వయంగా కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ మీకు లేఖ రాసిన విషయం మర్చిపోయారా?

జగన్ గారూ! ఏపీతో చేసుకున్న వివిధ ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయని కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ - ఏపీ సిఎస్ కు రాసిన లేఖ ఇది. మామూలుగా చెబితే మీ తలకెక్కదనే - మీ ముఖ్యమంత్రికి కాస్త అర్థమయ్యేలా చెప్పమని కూడా ఇందులో రాసారు. ఇకనైనా నిరాధార నిందలు వేయడం మానండి.'' అంటూ సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు లోకేష్. అయితే ఏ అంశంలో అయినా ఎవరి వాదనలు వారికి ఉంటాయి. అసలు కథ ముందు ముందు తేలుతుందిలే తొందరెందుకు లోకేష్ బాబూ అని పరిశీలకులు అంటున్నారు.