Begin typing your search above and press return to search.

రామ్మోహ‌న్ ద‌గ్గ‌ర క్లాసుల‌కు వెళ్లు లోకేశ్‌!

By:  Tupaki Desk   |   21 July 2018 4:54 AM GMT
రామ్మోహ‌న్ ద‌గ్గ‌ర క్లాసుల‌కు వెళ్లు లోకేశ్‌!
X
మాట్లాడితే ఎలా ఉండాలి? మోడీ స‌ర్కారు మీద‌ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా తెలుగు నేత‌లు చేసిన ప్ర‌సంగాల్ని చూసిన త‌ర్వాత ఇద్ద‌రు పేర్లు చ‌ప్పున గుర్తుకు వ‌స్తాయి. వారే.. టీడీపీ ఎంపీలు గ‌ల్లా జ‌య‌దేవ్‌.. రామ్మోహ‌న్ నాయుడులు. ఎలా మాట్లాడాల‌న్న దానిపై వీరిద్ద‌రూ త‌మ విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇరువురు నేతలు వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు ప్ర‌తిరూపంగా నిలిచిన‌ప్ప‌టికీ.. త‌మ కుటుంబ పెద్ద‌ల బ్యాగేజీకి త‌గ్గ‌ట్లే వ్య‌వ‌హ‌రించారే త‌ప్పించి.. వారి పేరు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం వాటిల్లేలా చేయ‌లేద‌ని చెప్పాలి.

వార‌సత్వ రాజ‌కీయాల‌కు నిలువెత్తు రూపంగా క‌నిపించే ఏపీ ముఖ్య‌మంత్రి కుమారుడు క‌మ్ ఏపీ మంత్రి లోకేశ్ బాబు.. నిన్న‌టి పార్ల‌మెంటు స‌మావేశాల్ని చూసిన త‌ర్వాత అయితే.. ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకుంటే బాగుంటుంది. ఒక నేత ఎలా మాట్లాడాలి? స‌మ‌స్య‌ల‌పై ఎలా రియాక్ట్ కావాల‌న్న దానిపై త‌మ పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎంపీలు చిన‌బాబుకు మార్గ‌ద‌ర్శ‌కంగా చేశార‌ని చెప్పాలి.

త‌మ యువ‌నేత నోరు విప్పితే ఏం ప్ర‌ళ‌యం వ‌స్తుందో.. మ‌రే సంచ‌ల‌నం న‌మోదు అవుతుందోన‌న్న‌ట్లుగా మారింది లోకేశ్ వ్య‌వ‌హారం చూస్తే. తానేం మాట్లాడుతున్నదానిపై ప‌ట్టు లేక‌పోవ‌టం.. త‌ప్పుల మీద త‌ప్పులు మాట్లాడ‌టం లోకేశ్ లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికైనా స‌రే..భేష‌జాల‌కు పోకుండా త‌మ పార్టీకి చెందిన ఇద్ద‌రు యువ ఎంపీల ద‌గ్గ‌ర‌కు ట్యూష‌న్ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లోకేశ్ పైన ఎంతైనా ఉంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అవిశ్వాసంపై చ‌ర్చ‌నుస్టార్ట్ చేసిన గ‌ల్లా జ‌య‌దేవ్‌.. గంట‌కు పైగా త‌న ప్ర‌సంగాన్ని ఇంగ్లిషులో సాగితే.. అవిశ్వాసంపై ప్ర‌ధాన‌మంత్రి మోడీ స‌మాధానం ఇవ్వ‌టానికి కాస్త ముందుగా ( ఆ టైంలో స‌భ‌లో మోడీ లేరు) ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు హిందీలో అద‌ర‌గొట్టేశారు. బుల్లెట్ స్పీడ్ వేగంతో త‌న‌కు ఇచ్చిన త‌క్కువ వ్య‌వ‌ధిలో ఆయ‌న త‌న ప్ర‌సంగాన్ని పూర్తి చేశారు. కేవ‌లం 12 నిమిషాల వ్య‌వ‌ధిలో.. ఎక్క‌డా త‌డ‌బాటుకు గురి కాకుండా నాన్ స్టాప్ గా హిందీలో మ‌హా ఆవేశంగా వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. ఇదంతా చూసిన తెలుగు త‌మ్ముళ్ల‌లో చాలామందికి త‌మ చిన‌బాబు.. అర్జెంట్ గా త‌న ప్ర‌సంగాల్ని మెరుగుప‌ర్చుకోవ‌టానికి ఈ ఇద్ద‌రిలో ఏ ఒక్క‌క‌రి ద‌గ్గ‌రైనా ట్యూష‌న్ కు వెళితే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్లీజ్ చిన‌బాబు.. కాస్త ఈ ఇష్యూ గురించి ఆలోచించు. ఏమంటావ్‌..?