Begin typing your search above and press return to search.

లోకేష్ నోట మీడియా ఛానెల్ మాట‌

By:  Tupaki Desk   |   27 April 2016 12:22 PM GMT
లోకేష్ నోట మీడియా ఛానెల్ మాట‌
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త‌నయుడు - టీడీపీ యువనేత నారా లోకేష్ మ‌రోమారు మీడియా సంస్థ‌ల గురించి మాట్లాడారు. విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంత‌రం లోకేష్ పార్టీ శ్రేణుల‌తో మాట్లాడుతూ సొంత మనవడు దేవాన్ష్ తో కాసేపు గడపలేనంత బిజీగా త‌న తండ్రి - ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బిజీ బీజీ జీవితాన్నిగడుపుతున్నారని అన్నారు. "రాష్ట్రాభివృద్ధి కోసం ప‌గ‌లు - రాత్రులు కుర్రాడిలా ముఖ్య‌మంత్రి కష్టపడుతున్నారు. రోజుకు 18 గంటలు మీటింగుల్లోనే బిజీ. 65 ఏళ్ళ వయసులో కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఆయనే మనకందరికీ స్ఫూర్తి” అని లోకేష్ వివరించారు.

ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ గురించి ప్ర‌స్తావిస్తూ బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌లే పార్టీ స‌త్తా అని తేల్చిచెప్పారు. “టీడీపీకి సొంతంగా ఎలాంటి ఛానెళ్ళూ - పత్రికలూ లేవు. అయితే పార్టీ కోస‌మే ప‌నిచేసే 54 లక్షల కార్యకర్తల బలం ఉంది. అంతకు మించిన ప్రజాదీవెన ఉంది. అందుకే ప్ర‌జా వ్య‌తిరేక వార్తలు రాసే కొన్ని మీడియా సంస్థ‌ల విష‌యంలో గంద‌ర‌గోళం చెంద‌వ‌ద్దు. పార్టీ కార్య‌క‌ర్త‌లు అస‌లు విష‌యాల‌ను వారికి వివ‌రించాలి” అని లోకేష్ సూచించారు.

ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న నారా లోకేష్ ప్రతీ జిల్లాపై పట్టు పెంచుకుంటున్నారు. టీడీపీ - వైఎస్ ఆర్‌ సీపీ కేడర్ ల బలాబలాలను అంచనా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ శ్రేణుల‌తో స‌మావేశం అవ‌డం వారి సాద‌క‌ - బాధ‌కాల‌ను ఓపిక‌గా వింటున్నారు. దీంతో పాటు పార్టీలో కొత్త‌గా చేరే నేత‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకునే విష‌యంలో తెలుగు త‌మ్ముళ్ల‌తో చ‌ర్చిస్తున్నారు. అభివృద్ధిలో అంతా క‌లిసి ముందుకు వెళ్లాలంటూ హిత‌బోధ చేస్తున్నారు. మొత్తంగా సీఎం చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌పై దృష్టి సారిస్తే... లోకేష్ పార్టీ వర్గాల‌తో మ‌మేకం అవుతున్నాడ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు భావిస్తున్నాయి.