Begin typing your search above and press return to search.

లోకేశ్ చేతిలో వైసీపీ నేతల పిలకలు

By:  Tupaki Desk   |   23 Jan 2016 9:40 AM GMT
లోకేశ్ చేతిలో వైసీపీ నేతల పిలకలు
X
ఏపీలో విపక్ష వైసీపీ నేతలు తమ దుందుడుకు వైఖరితో కొంత - మిగతా కారణాలతో మరికొంత తరచూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మిథున్ రెడ్డి - చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటివారిని పోలీసులు క్షణం ఖాళీ ఉంచకుండా కోర్టులకు, జైళ్లకు తిప్పుతూ కేసుల మీద కేసులు పెడుతున్నారు. అయితే... పోలీసులు పనిగట్టుకుని అలా చేయడానికి చంద్రబాబే కారణమన్న ప్రచారం ఒకటి జరుగుతోంది. కానీ, అందులో నిజం లేదని... చంద్రబాబు ఎవరినీ అలా వెంటాడే పరిస్థితిలో లేరని... ఈ వేట సాగిస్తున్నది చినబాబు లోకేశ్ అని వినిపిస్తోంది.

వైసీపీ నేతల్లో ఎవరెరవరు రెచ్చిపోతున్నారన్నది జిల్లాలవారీగా ఆయన ఓ రిపోర్టు తెప్పించుకున్నారట. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు - నేతలను ఇబ్బంది పెడుతున్న వైసీపీ నేతలెవరన్నది ఆయన గుర్తించి వారిపై ఫస్ట్ రౌండ్లో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే... ఎంపీ మిథున్ రెడ్డిపై లోకేశ్ కన్నేయకున్నా ఆయనే తనకు తానుగా కేసుల్లో ఇరుక్కున్నాడని అంటున్నారు. చెవిరెడ్డిని మాత్రం రఫ్పాడించేందుకు చిత్తూరు - నెల్లూరు పోలీసులకు లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

అయితే.. లోకేశ్ మాత్రం వైసీపీ నేతలపై కేసుల్లో తమ ప్రమేయం లేదని చెబుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వరుసగా కేసులు పెట్టి జైళ్ల చుట్టు తిప్పడంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న లోకేశ్ గత ప్రభుత్వాలు పెట్టిన కేసులే చెవిరెడ్డిపై 45 ఉన్నాయని పక్కా నంబర్ చెబుతున్నారు. దీంతో లోకేశ్ పై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. చెవిరెడ్డిపై ఎన్ని కేసులున్నాయి.. ఎక్కడెక్కడ ఉన్నాయన్నది అంత పక్కాగా లోకేశ్ కు ఎలా తెలిసిందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆయన మొత్తం రిపోర్టు తెప్పించుకుని ఆడిస్తున్నారని అంటున్నారు.

కాగా వైసీపీ నేతలను లోకేశ్ టార్గెట్ చేశారని అర్థం కావడంతో చాలామంది నేతలు కామ్ అయిపోయినట్లు సమాచారం. అధికారంలో లేనప్పుడు కేసులతో తల గోక్కోవడం అనవసరమన్న ఉద్దేశంలో చాలామంది సైలెంటుగా మారిపోయారు.