Begin typing your search above and press return to search.

లోకేశ్ పోటీ చేసేది అక్క‌డి నుంచేనా?

By:  Tupaki Desk   |   1 March 2019 5:15 AM GMT
లోకేశ్ పోటీ చేసేది అక్క‌డి నుంచేనా?
X
ఏపీలో రాజకీయం అంత‌కంత‌కూ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. అధికారికంగా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌ట‌మే త‌రువాయి అన్న‌ట్లుగా ప‌రిస్థితులు ఉన్నాయి. ఏపీలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల‌కు మాన‌సికంగా సిద్ధం కావ‌ట‌మే కాదు.. త‌మ బ‌ల‌గాల్ని మొహ‌రించాయి. బ‌రిలోకి దింపే అభ్య‌ర్థుల‌పై క‌స‌ర‌త్తు దాదాపుగా పూర్తి చేశాయి. వాస్త‌వానికిఇప్ప‌టికే కొన్ని స్థానాల‌కు అభ్య‌ర్థుల్ని ఆయా పార్టీలు ప్ర‌క‌టించాయి కూడా.

ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు క‌మ్ మంత్రి నారా లోకేశ్ తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్నట్లుగా చెబుతున్నారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల ద్వారా ఎన్నిక కాకుండా.. ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయిన లోకేశ్‌.. తాజా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని డిసైడ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇందుకోసం ఆయ‌న పోటీ చేసే స్థానాన్ని దాదాపుగా క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. తొలుత కుప్పం నుంచి ఆయ‌న్ను బ‌రిలోకి దింపాల‌ని భావించినా.. పార్టీ అధ్య‌క్షులు చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స్థానం కావ‌టం.. ఆ స్థానం కాకుండా వేరే స్థానం నుంచి లోకేశ్ ను దింపితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

అదే స‌మ‌యంలో రాయ‌ల‌సీమలోని ఏదైనా నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోకేశ్ పోటీకి దింపాల‌న్న చ‌ర్చ జ‌రిగింది. తండ్రి.. కొడుకులు ఇద్ద‌రూ సీమ ప్రాంతం నుంచి పోటీ చేయ‌టం బాగోద‌న్న ఆలోచ‌న‌తో.. పార్టీకి పెట్ట‌ని కోట లాంటి ఉత్త‌రాంధ్ర నుంచి బ‌రిలోకి లోకేశ్ ను దింపాల‌న్న ఆలోచ‌న చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా భీమిలి నుంచి లోకేశ్ బ‌రిలోకి దిగితే బాగుంటుంద‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

పార్టీ బ‌లంగా ఉండ‌టంతో పాటు.. ఆ స్థానం నుంచి అయితే లోకేశ్ విజ‌యం ప‌క్కా అన్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి.. ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి గంటాతో ఇప్ప‌టికే చ‌ర్చ‌లు పూర్తి అయ్యాయ‌ని.. ఆయ‌న్ను విశాఖ ఉత్త‌రం నుంచి బ‌రిలోకి దింపాల‌న్న ఆలోచ‌న చేసిన‌ట్లుగా చెబుతున్నారు. లోకేశ్ గెలుపు బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని.. అన్ని అంశాలు తాను చూసుకుంటాన‌న్న మాట ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం. గంటా మీద భ‌రోసాతో లోకేశ్ ను భీమిలి బ‌రిలో దింపాల‌న్న విష‌యంపై ఒక నిర్ణ‌యానికి బాబు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.